తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయం నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ ఆఫీసుకు సమాచారం అందింది. న్యూఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. ఒక్కొక్కటి 550 చదరపు మీటర్లు ఉన్న రెండు పక్క పక్క ప్లాట్లను టీఆర్ఎస్కు కేటాయించింది. కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ లాండ్ అలాట్మెంట్ ఆఫీసర్ దీన్ దయాళ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. ఢిల్లీలో స్థలం కేటాయింపు జరగడంతో అక్కడ పార్టీ ఆఫీసు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరిపి, త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, దీనికి కొన్ని కండిషన్లు కూడా ఉంటాయి. కేంద్రం కేటాయించిన భూమికి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరానికి రూ.2579.49 లక్షలు (అంటే సుమారు రూ.25 కోట్ల పైచిలుకు/ ఎకరానికి) చెల్లించాలి. భూమికి ప్రతి ఏటా 2.5 శాతం వార్షిక అద్దె చెల్లించాలి. అయితే, ఈ ధర మార్చి 31వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఏప్రిల్ 1, 2020 తర్వాత నుంచి కేంద్రం భూముల ధరల్లో ఏమైనా మార్పులు చేస్తే దానికి తగినట్టు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కండిషన్లు అంగీకారమైతే రూ.10 బాండ్ పేపర్ మీద ఒప్పందం చేసుకోవాలి.
ఎకరం రూ.25 కోట్లు (సుమారు) చెల్లించాలని కేంద్రం చెప్పింది. కానీ, టీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది 1100 చదరపు మీటర్లు. అంటే 1315.589 చదరపు అడుగులు అన్నమాట. ఒక ఎకరానికి 4800 చదరపు గజాలు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి పావు ఎకరం మీద కొంచెం ఎక్కువ కేటాయించినట్టు. ఆ లెక్కన ఎకరం రూ.25 కోట్లు చొప్పున లెక్కిస్తే టీఆర్ఎస్ పార్టీ తమకు కేటాయించిన భూమికి సుమారుగా రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

టీఆర్ఎస్ భవన్‌కు స్థలం కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు
దేశ రాజధాని హస్తినలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం కోసం కేసీఆర్ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు స్థలం కేటాయించాలంటూ టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నిబంధనల ప్రకారం 16 మందికి పైగా ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 1000 చదరపు మీటర్ల స్థలం కేటాయించేందుకు అవకాశం ఉంది. అయితే, కేంద్రం 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. రాజకీయ పార్టీలకు ఢిల్లీలో పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం భూమి కేటాయించడం కొత్త పద్ధతేమీ కాదు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఢిల్లీలో స్థలం పొందాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు సొంత ఆఫీసులు నిర్మించుకునేందుకు సగటున 30 సెంట్ల భూమి కేటాయించాలని 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పార్టీలు, రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే భూములు కేటాయిస్తారు. సొంతగా భూమి, ఆఫీసు లేని పార్టీలకే కొత్తగా 30 సెంట్ల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయిస్తారు. లీజు కాలపరిమితి 33 ఏళ్లగా నిర్ణయించారు. పార్టీ మనుగడను బట్టి లీజు కాలాన్ని 99 ఏళ్లపాటు పొడిగించే వెసులుబాటు కల్పించారు. ఏడాదికి లీజు ఫీజు రూ.1000. భూములు పొందాక రెండేళ్లలోగా పార్టీ ఆఫీసుల నిర్మాణం జరగాలి. ఇందుకు భిన్నంగా ఆ భూమిని ఇతర ప్రయోజనాలు, అవసరాలకు వినియోగించకూడదు. ఇతరులకు అమ్మడం లేదా లీజుకివ్వడం పూర్తిగా నిషిద్ధం. షరతులు ఉల్లంఘిస్తే..భూమి కేటాయింపు ఉత్తర్వులను ఆటోమెటిక్‌గా ర ద్దుచేసే అధికారం జిల్లా కలె క్టర్‌కు అప్పగించారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా, వాటికి ధరచెల్లించకుండానే జిల్లా కలెక్టరు స్వాధీనం చేసుకునే అధికారం కల్పించారు. అయితే, అందులో ఎన్ని అమలయ్యాయనేది అధికారులకే తెలియాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:October 09, 2020, 20:00 IST