Home /News /telangana /

CENTRAL GOVT FOCUS ON BHADRADRI AS BJP PLANS TO GAIN POLITICAL MILEAGE IN TELANGANA SK

భద్రాద్రిపై కేంద్రం గురి.. తెర వెనక బీజేపీ అసలు వ్యూహం ఇదేనా...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భద్రాచలం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనవైఖరిని తన రాజకీయ విస్తరణకు ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం ప్రతినిధి)
  ఇది నిజంగా నిజమేనా..? భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందా..? పెద్ద మొత్తంలో నిధులు కుమ్మరించి భద్రాద్రి కారిడార్‌ను ఏర్పాటు చేయనుందా..? ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ఆసక్తి లేని భద్రాద్రి ప్రాంతాన్ని పరిపాలనా పరంగా తాను నేరుగా పర్యవేక్షించాలనుకుంటుందా..? ఎలా..? గత కొద్ది రోజులుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

  ఒకవేళ నిజమే అయితే చట్టపరమైన, రాజ్యాంగపరమైన అనేక అంశాలు అడ్డు తగిలే అవకాశాలు లేవా..? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది. ఈ మేరకు కొందరు పీఎంవోను తరచూ సంప్రదిస్తూ భద్రాద్రిపై ఏదో ఒక నిర్ణయానికి ఎందుకు లాబీయింగ్‌ చేస్తున్నారన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొత్తంమీద భద్రాద్రి రాముణ్ని కూడా ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా భద్రాద్రిపై తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే ఇదంతా జరుగుతోందన్నది మాత్రం నిజం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. తాజాగా భద్రాచలం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనవైఖరిని తన రాజకీయ విస్తరణకు ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  నేలకొండపల్లిలో పుట్టిన కంచర్ల గోపన్న.. అప్పటి గోల్కొండ నవాబు తానీషా కొలువులో మంత్రులుగా ఉన్న తన మేనమామలు అక్కన్న, మాదన్నల ద్వారా ఆ ప్రాంత తహశీల్దారుగా నియుక్తులు కావడం.. అక్కడ శ్రీరామునికి భక్తునిగా మారి గోదావరి తీరంలో గొప్ప దేవాలయం నిర్మించడం చరిత్ర. మొదట్లో ఆగ్రహం వ్యక్తం చేసినా అనంతరం ప్రజల్లో ఉన్న మతపరమైన సెంటిమెంట్‌ను కాదనలేక ఆ దేవాలయాన్ని తానీషా 'ఓన్‌' చేసుకోవడం.. అనంతర కాలంలో ప్రతి ఏడాది నిర్వహించే శ్రీసీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు రాజు స్వయంగా లేదంటే ఆయన తరపున ప్రతినిధులు తేవడం రివాజుగా మారింది. అనంతరం కాలంలో వచ్చిన అసఫ్‌జాహీ పాలకులు సైతం ఈ సంప్రదాయాన్ని పాటించారు. దీనికి కారణం లేకపోలేదు. నాటి గోల్కొండ రాజ్యంలో, ఆ తర్వాతి నైజాం రాజ్యంలోనూ హిందూ జనాభా ఎక్కువగా ఉండడం, ప్రజల చేత మిక్కిలిగా కొలవబడుతున్న దేవుణ్ని 'ఓన్‌' చేసుకోవడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనడం, తద్వారా మతపరమైన వ్యతిరేకతలు రాకుండా చూసుకోవడం ఆనాటి రాజనీతి. అయితే స్వాతంత్య్రానంతరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారు స్వయంగా సీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తేవడం, స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రకటించి అన్ని రకాల ప్రొటోకాల్స్‌ రూపొందించారు. ‌అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దగ్గరి నుంచి భద్రాద్రి సీతారాముల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఒక బలమైన ఆరోపణ ఉంది. దీనికి ఉదాహరణలు కూడా లేకపోలేదు.

  అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలోనూ భద్రాచలం కోసం అప్పట్లో కేసీఆర్‌ పెద్దగా పట్టుబట్టకపోవడంతోనే ఈ నిర్లక్ష్యానికి బీజం పడిందన్నది అసలు చర్చ. దీంతోనే భద్రాచలం నియోజకవర్గంలోని వరరామచంద్రపురం, కూనవరం, చింతూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలం పాక్షికంగా ఆంధ్రకు వెళ్లిపోయింది. దీంతోపాటు గోదావరికి ఇటువైపున ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా, బూర్గంపాడు మండలం పాక్షికంగానూ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లాయి. ఈ విలీనానికి అప్పట్లో పోలవరం ముంపును సాకుగా చూపారని.. 'పోలవరం సబ్‌మెర్జెన్స్‌' ఏరియాను తగ్గించుకోవాలని కేసీఆర్‌ కనీసం డిమాండ్‌ కూడా చేయలేదని ఇప్పటికీ కొందరు గుర్తుచేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం హోదాలో కేసీఆర్‌ కేవలం ఒకేఒక్కసారి సీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తెచ్చారు. ఆ సమయంలోనే రూ.100 కోట్లతో భద్రాద్రిని పూర్తిస్థాయిలో టెంపుల్‌సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అనంతరం గోదావరి పుష్కరాల సమయంలో రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఏ విధమైన చొరవ తీసుకోవడం లేదని 'భద్రాద్రి ప్రాంత పరిరక్షణ కమిటీ' ఆరోపణలు చేస్తోంది. దీనిపై అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని ఆ కమిటీ అధ్యక్షుడు బూసిరెడ్డి శంకరరెడ్డి చెప్పారు. తమ నివేదనలు, నివేదికల ఫలితంగానే కేంద్రం స్పందించిందని 'సీతారామ కారిడార్‌' ఏర్పాటుపై అధ్యయనం చేయిస్తామని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయన్నారు.

  అయితే 'భద్రాద్రి ప్రాంత పరిరక్షణ కమిటీ' కోరిన విధంగా ఓ ప్రత్యేక కారిడార్‌ సాధ్యమా అంటే అంత ఈజీ కాదు. కారణం ఎండోమెంట్‌ సబ్జెక్ట్‌ అంతా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. అదీకాక భద్రాచలం షెడ్యూల్‌ ఏరియాలో ఉంది. ఇక్కడ 1\70 చట్టం అమల్లో ఉంటుంది కనుక భూసేకరణకు సంబంధించి ఏ పని చేయాలన్నా చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నది అసలు నిజం. ఈ పరిస్థితులలో ప్రత్యేక కారిడార్‌ లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం లాంటివి అనుకున్నంత సులభం కాదు కూడా. అయితే భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించినట్టు చొరవ చూపాలన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Lord rama, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు