Hyderabad Floods: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం.. రెండు రోజులు ఇక్కడే..

Telangana News: రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించనున్నారు.

news18-telugu
Updated: October 21, 2020, 2:59 PM IST
Hyderabad Floods: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం.. రెండు రోజులు ఇక్కడే..
Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. ఏ ప్రాంతంలో ఎంత పడిందంటే..
  • Share this:
హైదరాబాద్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాద్ రానుంది. రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం సభ్యులు పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లో భారీ నష్టం జరిగిందని... తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం బృందం తెలంగాణకు రానుంది.

మరోవైపు హైదరాబాద్ వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకోసం సీఎం సహాయనిధి నుంచి రూ.550కోట్లు కేటాయించింది. ముగ్గురు అధికారుల కమిటీ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకు కుటుంబ, భౌగోళిక వివరాలను యాప్‌లో పొందుపరచాలని ప్రభుత్వం అధికారులను సూచించింది. మొత్తం ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష సాయం, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

అధికారులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆధార్‌, రేషన్‌ కార్డుల వివరాలను నమోదు చేయాలని, డూప్లికేషన్‌కు తావు లేకుండా ఒకేసారి అందేలా చూడాలని చెప్పింది. కుటుంబ యజమానితో పాటు ముగ్గురు అధికారుల సంతకాలు చేయాలని, ఇతర నగర, మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని చెప్పింది. పలు చోట్ల మంత్రులు స్వయంగా వరద బాధితులకు ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు.

ఇదిలా ఉంటే భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందిపడుతున్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు కూడా తమ వంతు సాయం ప్రకటించాయి. తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా.. బెంగాల్ ప్రభుత్వం రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
Published by: Kishore Akkaladevi
First published: October 21, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading