కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(Kalvakuntla Kavitha) సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ కవిత పేరును చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కవితకు సీబీఐ నోటసులు జారీ చేసింది. ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో(Hyderabad) ఎక్కడైనా కవిత విచారణకు హాజరుకావొచ్చని సీబీఐ పేర్కొంది. ఈ నెల 6న హైదరాబాద్‌లో కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 160 సీఆర్పీసీ కింద సీబీఐ(CBI) కవితకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును సీబీఐ పొందుపర్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో అమిత్ పలు అంశాలను పొందుపర్చింది. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది తమ 176 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని రిపోర్టులో పేర్కొంది. 170 సెల్ఫోన్లలో 17 సెల్ఫోన్ల నుంచి డేటాను తిరిగి పొందగలిగామని... అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవని తెలిపింది. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేదని రిపోర్టులో ఈడీ పేర్కొంది.
అయితే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై స్పందించిన కవిత.. ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని ఆరోపించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు.
రేవంత్ తో నాది తోటికోడళ్ల పంచాయితీ..కానీ కలిసే పని చేస్తాం..జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డైరెక్షన్ ఇవ్వడానికి మీరెవరు..సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు ఆగ్రహం..క్షమాపణ చెప్పిన గంగాధర్
తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది సహజమే అని.. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.