ఢిల్లీలో తెలంగాణ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ. 5 లక్షల డబ్బులు డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం అక్రమం అంటూ సదరు వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. డబ్బులు తీసుకుంటుండగా వారిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు ఎంపీ మాలోతు కవిత అధికారిక క్వార్టర్లో పట్టుబడినట్టు సమాచారం.
డబ్బులు వసూలు చేసిన వారిని రాజీబ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్‌లుగా గుర్తించింది సీబీఐ. వారిని అరెస్ట్ చేసింది. పర్మిత్ సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన సీబీఐ.. నిందితులు లక్ష రూపాయలు వసూలు చేస్తుండగా పట్టుకుంది. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది.
అయితే ఈ అంశంపై ఎంపీ మాలోతు కవిత స్పందించారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని వివరణ ఇచ్చారు. అరెస్టయిన వారిలో దుర్గేష్ తన కారు డ్రైవర్ అని తెలిపారు. అందుకే అతడిని తన స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చానని అన్నారు. దుర్గేష్ తప్పు చేస్తే అతడిపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
ఎంపీ మాలోతు కవిత (ఫైల్ ఫోటో)
తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి మాలోతు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్‌ను పక్కనపెట్టి రెడ్యానాయక్ కూతురు కవితకు గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.