Cattle smuggling: నోరులేని మూగజీవాలు. ఆకులూ, అలములూ తింటూ వాటి బతుకేవో అవి బతుకుతూ ఉంటాయి. అలాంటి గోమాతలను చంపడానికి వెనకాడట్లేదు కొందరు. తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న దారుణాన్ని ముందే కనిపెట్టి అడ్డుకొని... అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న గోవులను కాపాడారు గోరక్షా దళ్ సభ్యులు, యుగతులసి టీమ్. జహీరాబాద్ నుంచి బహదూర్ పురా కబేళాలకు రెండు డీసీఎం వాహనాలలో గోవులను తరలిస్తుండగా... విషయం గోరక్షా, యుగతులసి ఫౌండేషన్ సభ్యులకు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ గోవులకు ఏమీ కాకూడదు అనుకుంటూ... వెంటనే వారు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలర్టైన పోలీసులు... ఆఘమేఘాలపై వెళ్లి... మెహదీపట్నం... షేక్ పేట ఫ్లై ఓవర్, మెహిదీపట్నం రేతిబౌలి దగ్గర రెండు డీసీఎం వాహనాల్లో తరలిస్తున్న 50కి పైగా గోవులను కాపాడారు. గోవులను, వాటిని తరలిస్తున్న వారిని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది. కార్వాన్ MIM ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్... పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఇది సున్నితమైన అంశం కాబట్టి... వివాదం తలెత్తకుండా పరిష్కరించాలని కోరారు. ఐతే... గోవులను తరలించేవారిని, దాని వెనక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ... డీసీపీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు గోరక్షా దళ్ సభ్యులు, బీజేపీ నేతలు.
నోరు లేని మూగ జీవాలను, పవిత్ర సాధు జంతువులను చంపొద్దనీ... వాటి బదులుగా... కోళ్లు, మేకలు, గొర్రెల వంటి వాటిని కబేళాలకు తీసుకెళ్లమని కోరుతున్నారు. సెన్సిటివ్ అంశం కావడంతో అటు పోలీసులు కూడా దీనిపై ఆచితూచి స్పందిస్తున్నారు.