( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా )
క్యాథ్‌ల్యాబ్.. గుండెపోటు.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులను గుర్తించడం కోసం చేసే యాంజియోగ్రామ్.. యాంజియోప్లాస్టీ.. పేస్మేకర్ల అమరిక.. గుండె సంబంధిత లోపాలను గుర్తించడంతో పాటు గుండె కొట్టుకునే విషయంలో ఉన్న లోపాలను గుర్తంచడం.. సవరించడం.. అవసరమైనప్పుడు స్టంట్ల అమరిక.. గుండె కవాటాల మార్పిడి.. గుండె చుట్టూ నీరు చేరితే తొలగించడం.. గుండెకు రక్తం పంపిణీలో లోపాలను సవరించడం.. చిన్నపిల్లల గుండెకు రంధ్రం పడితే చేసే చికిత్సలు సత్వరమే చేయడం.. అదీ ఉచితంగా.. ఇప్పటిదాకా కేవలం కార్పోరేట్ ఆసుపత్రులకే పరిమితం అయిన ఇలాంటి అధునాతన ఖరీదైన వైద్యసేవలు ఇప్పుడు జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు, సిద్దిపేట, మహబుబ్‌నగర్ జిల్లాల్లో లభ్యం కానున్నాయి.
పూర్తిగా ఉచితంగా ఏదైనా గుండె సంబంధిత సమస్యలు తలెత్తితే రూ.లక్షలు ఖర్చయ్యే ఈ వైద్యాన్ని చేయించుకోలేక, అసహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయే పేద, బడుగు, బలహీన వర్గాలకు ఈ సౌకర్యం వర ప్రధాయనిలా మారనుంది. దీనితోపాటు ఇలాంటి తక్షణ వైద్యం కోసం హైదరాబాద్ దాకా వెళ్లే లోగానే ప్రాణాలు పోతున్న సందర్భాలున్నాయి. ఈ ఆధునిక సౌకర్యాన్ని సక్రమంగా వినియోగిస్తే ఏటా వందల సంఖ్యలో ప్రాణాలను కాపాడొచ్చు. ఇక్కడ ఇప్పటికే ఉన్న 520 పడకల ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ క్యాథ్‌ల్యాబ్‌తో పాటు, మరో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్‌ను, మదర్‌మిల్క్ బ్యాంకును శుక్రవారం నాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు.
Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..
ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటైన విషయం తెలిసిందే. వైద్యసేవల్లో ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేటింగ్‌లో 'ఏ' గ్రేడ్ లభిస్తుండడం తెలిసిందే. ఈ ఆసుపత్రిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు పలుమార్లు అవార్డులు సైతం లభించాయి. కోవిడ్-19 కరోనా చికిత్సలోనూ ఈ ఆసుపత్రి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఇలా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పేదవాడి గుండెకు రక్షగా నిలవనుంది. వేధిస్తున్న వైద్యుల, సిబ్బంది కొరత..
ఇంతటి సేవలు అందిస్తున్న ఆధునిక వైద్యకేంద్రంలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 520 పడకలకు తగినట్టుగా పోస్టులను నింపలేదు. ఇక్కడ స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిఫ్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ సహా అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్నర్స్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా వార్డుబాయ్, స్టెచర్బేరర్స్, జేఎస్డబ్ల్యూల అసవరం ఉంది. ఆసుపత్రిలో మొత్తం 258 పోస్టులకు గానూ 190 మంది, మాతా శిశు కేంద్రంలో 66 పోస్టులకు గానూ 40 మంది మాత్రమే ఉన్నారు. ఇలా మొత్తం ఉన్న సిబ్బంది 216 మందిలో రెగ్యులర్ ఉద్యోగులు 165 మంది మాత్రమే ఉన్నారు.
Sangareddy : తల్లిని హత్య చేసేందుకు , భార్యను పుట్టింటికి పంపాడు.. ఆ తర్వాత
అవసరమైన స్థాయిలో నిపుణులైన వైద్యులను, సిబ్బందిని నింపితే వైద్యసేవలు మరింత మెరుగయ్యే పరిస్థితి ఉంది.ఇక మధిర, సత్తుపల్లిల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వీటిని కూడా నేడు మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను, భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో సీజనల్ వ్యాధులు, పెండమిక్ వ్యాధులు సహా దాదాపు అన్ని వైద్య సౌకర్యాలు ఎక్కడికక్కడే లభ్యం కానున్నాయి. ఇప్పటిదాకా ఏచిన్న ఎమర్జెన్సీ అవసరం వచ్చినా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పరిగెత్తే పరిస్థితి ఉండేది. కానీ వీటిని అప్‌గ్రేడ్ చేయడంతో ఖమ్మం ఆసుపత్రిపై భారం తగ్గనుంది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుపై మంత్రి హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Telangana