టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

ప్రతీకాత్మక చిత్రం

TDP Analysis : ఓటమికి కారణాల్ని తెలుసుకుంటున్న టీడీపీ... కుల సమీకరణల్లో ఎలా దెబ్బతిన్నదీ విశ్లేషించుకుంది. ఆ క్రమంలో తెలిసిన కొన్ని విషయాలు పార్టీ సీనియర్లకు ఆశ్చర్యం కలిగించాయి.

  • Share this:
ఏపీ రాజకీయాల్నీ, కుల సమీకరణల్నీ వేరువేరుగా చూడలేం. ఆయా కులాలను దగ్గర చేసుకున్న పార్టీలకే గెలుపు అవకాశాలు ఎక్కువ. ఏపీలో కీలకమైన వర్గంగా ఉన్న బీసీలు ఇన్నాళ్లూ టీడీపీవైపే ఉన్నారు. ఇప్పుడు వాళ్లు వైసీపీకి జైకొట్టడంతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఎన్టీఆర్ హయాం నుంచీ టీడీపీ... కుల సమీకరణల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. వివిధ జిల్లాల్లో ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటే, ఆ కులానికి చెందినవారిని నాయకులుగా నియమిస్తూ, మిగతా కులాలు దెబ్బతినకుండా సమతుల్యత సాధిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం ఆ విషయంలో అట్టర్ ఫ్లాపైందని పార్టీ వర్గాల అంతర్గత చర్చల్లో తేలింది. మీకు తెలుసు 2014లో కోస్తా జిల్లాలు టైడీపీ వైపు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కీలక వర్గమైన కాపులు... టీడీపీకి ఓటు వేశారు. ఇప్పుడు అదే కాపులు... వైసీపీ, జనసేనవైపు మొగ్గు చూపారని టీడీపీ విశ్లేషణల్లో తేలింది.

కాపుల దగ్గర కాక... బీసీలకు దూరమై : కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ రూపంలో ఓ ఉద్యమం తెరపైకి రావడంతో... జాగ్రత్త పడిన టీడీపీ... కాపు కార్పొరేషన్ పెట్టి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి... కొంతవరకూ ఉద్యమాన్ని చల్లార్చింది. ఆ తర్వాత ఓ కమిషన్ వేసి, కాపులను బీసీల్లో చేర్చి, రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంపై అధ్యయనం చెయ్యమంది. అంతే... బీసీల్లో ఆగ్రహజ్వాలలు రగిలాయి. కాపులు బీసీల్లోకి వస్తే, ఇక తమకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా పోతాయని బీసీ వర్గాలు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని లేటుగా గుర్తించిన టీడీపీ... బీసీ ఆదరణ పథకం తెచ్చింది. జయహో బీసీ సభ పెట్టింది. ఐతే... అప్పటికే ఆలస్యమైంది. బీసీలు డిసైడైపోయారు వైసీపీయే బెటరని.

దెబ్బతీసిన జనసేన : కాపులకు అనుకూల నిర్ణయం తీసుకుంటే, మరి కాపుల ఓట్లు ఎందుకు టీడీపీకి ఎందుకు రాలేదన్న ప్రశ్నకు పార్టీ సీనియర్లు కొన్ని కారణాలు చెప్పారు. 2014 టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో... సహజంగానే కాపులు టీడీపీకి సపోర్ట్ చేశారనీ, ఇప్పుడు అదే జనసేన విడిగా, ప్రత్యర్థిగా పోటీ చేయడంతో... కాపుల ఓట్లు టీడీపీ, జనసేన మధ్య చీలిపోయాయనీ, అది టీడీపీకి నష్టం కలిగించిదని విశ్లేషించారు పార్టీ సీనియర్ నేతలు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా... అప్పటికే కాపులు... జనసేనవైపు మళ్లారని చంద్రబాబుకు తెలిపారు గోదావరి జిల్లాల నేతలు.

ఎస్సీలు కూడా టీడీపీకి దూరం : ఎస్సీ ఉపకులాల్లో మాదిగలు టీడీపీ వైపు... మాలలు వైసీపీవైపు ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో మాలలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ఇవ్వలేదు టీడీపీ. పార్టీలో మాల నాయకత్వానికి ప్రాధాన్యం పెంచింది. దాంతో మాదిగ నేతల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా మాల వర్గం నుంచీ టీడీపీకి ఎక్కువ ఓట్లేమీ రాలేదు. అదే సమయంలో... మాదిగ వర్గం ఓట్లు వైసీపీకి వెళ్లిపోయాయని విశ్లేషించారు టీడీపీ సీనియర్లు.

కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం : ఇక టీడీపీపై మొదటి నుంచీ ఉన్న అపవాదు అలాగే ఉంది. ఆ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఉంటుందనీ, రెడ్డి సామాజిక వర్గానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరనే ప్రచారం ఈసారీ జోరుగా సాగింది. తద్వారా వైసీపీ రెడ్డి సామాజిక వర్గం ఓట్లను భారీస్థాయిలో సంపాదించుకోగలిగిందన్నది మరో సమీకరణం.

మత పరంగానూ దెబ్బతిన్న టీడీపీ : వైసీపీకి సహజంగానే క్రైస్తవ మత ప్రజల మద్దతు ఉంది. 2014లో టీడీపీ, బీజేపీ కలవడంతో... ముస్లింల మద్దతు వైసీపీకి లభించింది. నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయినా, ముస్లింలు మళ్లీ టీడీపీవైపు చూడలేదు. ఫలితంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమలో వైసీపీ దుమ్మురేపింది.

 

ఇవి కూడా చదవండి :

రాడార్లపై మోదీ చెప్పింది... అప్పుడు రాంగ్... ఇప్పుడు రైట్...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

నేడు తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి...

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: