తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందనే ప్రచారం సాగుతోంది. మంత్రులు, సీనియర్ నేతలు సైతం ఈ వార్తలకు బలాన్ని ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తుండటంతో... త్వరలోనే కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరుగుతుందని తెలంగాణ రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీకి కొత్త ఊపు వస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. యువనేత సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే.. దూకుడుగా ముందుకు వెళతారని.. బీజేపీ స్పీడుకు బ్రేకులు పడతాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే కేటీఆర్ సీఎం అవుతున్నారనే వార్త కొందరు నేతలకు మాత్రం కంటిమీద కునుకులేకుండా చేస్తోందని సమాచారం. కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే.. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలోనే కేబినెట్ ప్రక్షాళన చేపట్టాలని కేసీఆర్ అనుకున్నారని.. అయితే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించిన తరువాత ఈ ప్రక్రియ చేపడితే బాగుంటుందని భావించారని తెలుస్తోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆయన మంత్రివర్గం మొత్తం రద్దవుతుంది. మళ్లీ కొత్త ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రులంతా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే కేటీఆర్ కేబినెట్లో మళ్లీ ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమందికి చోటు లభిస్తుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అరడజను మందికి కేబినెట్లో కచ్చితంగా చోటు దక్కుతుందని కొందరు చెబుతున్నా.. మిగతా వారికి అవకాశాలు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చర్చ జరుగుతోంది.

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మంత్రి, కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు మరికొందరు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఉందని.. కొత్త కేబినెట్‌పై కచ్చితంగా తన మార్కు ఉండేలా కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని టీఆర్ఎస్లోని కొందరు భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ కూడా కేటీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కేబినెట్లో ఉన్న అనేకమంది మంత్రులకు టెన్షన్ పట్టుకుందని.. కొందరు ఇప్పటికే కొత్త కేబినెట్లో తమ స్థానం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారని టాక్. అయితే ఇందుకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరికీ పూర్తి వివరాలు తెలియవని.. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:January 23, 2021, 19:33 IST