(సయ్యద్ రఫీ, న్యూస్-18 తెలుగు రిపోర్టర్, మహబూబ్‌నగర్)
“ఉప్పు... పప్పు... పాలు... పిండి... కాదేది కల్తీకి అనర్హం” అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తుండడం… వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలోపేతం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామ మాత్రపు సొమ్ము నైనా కల్తీల నియంత్రణ, నిరోధానికి ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై న్యాయ స్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా... ఆధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రంగానే ఉన్నాయి.
జొన్న రొట్టెను కూడా వదలని కల్తీగాళ్లు:
ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కల్తీ ఆహార వస్తువులేవో, అసలువేవో తెలుసుకోవడం అవసరం. ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల ఎన్నో ఆహార పదార్థాలను మనం పక్కన పెట్టేశాం. కానీ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలోని ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే మళ్లీ పాత పద్దతుల్లోనే కొన్ని ఆహార పదార్ధాలను తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైన ఆహార పదార్థం జొన్నరొట్టె. ఇప్పుడు ఈ జొన్న రొట్టె వ్యాపారం కూడా మార్కెట్‌లో కల్తీగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా.. పట్టణంలో కొన్నేళ్లుగా జొన్న రొట్టెల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు వ్యాపారం పెరగడంతో ఇది తయారు చేసేవారు అడ్డదారులు తొక్కుతున్నారు. జొన్న రొట్టెల్లో ఎక్కువ కల్తీ చేస్తుండడంతో ప్రజలు అవస్థల పాలు అవుతున్నారు. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
ఇంత దారుణమా:
జొన్న పిండిలో అత్యధిక శాతం రేషన్ బియ్యం ఉపయోగిస్తున్నారు. రొట్టె రంగు రావడానికి పసుపు రంగు వచ్చేట్టు కెమికల్ పౌడర్ కలుపుతున్నారు. ఈ విషపు పౌడర్ లు తినడం వల్ల అజీర్తి, అనారోగ్య ఇతర సమస్యలు మొదలవుతున్నాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ రొట్టె ఎంతో మంచిదని, అరుగుదలకు ఉబకాయం ఉన్నవాళ్ళకు ఉపయోగపడుతుందన్న నమ్మకంతో వీటిని చాలామంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రజల అవసరాలకు అనుగుణంగా రొట్టెలు విక్రయిస్తున్నప్పటికీ వ్యాపార మొహంతో ధన దాహంతో ఇప్పుడు రొట్టెలను కల్తీ చేస్తున్నారు. ఏ సందులో చూసిన రొట్టెలవిక్రయాలు దర్శనం ఇస్తాయి. కానీ అవి ఎలా కల్తీ ఉన్నాయో? పరిశీలిస్తే తెలుస్తుంది. నమలడానికి కూడా రాదు. వాటిని నమిలి కనతలు కూడా నొచ్చుతాయి.
ఇంకా కల్తీ కానిదీ ఏముంది:
తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈ జొన్న రొట్టెనే తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. జొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఎన్నో అత్యవసర పోషకాలు ఉన్నాయి. ఈ జొన్న వల్ల మరిన్ని ఉపయోగాలను తెలుసుకుని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి దీంతో సిరప్, ఇథనాల్, బయో ఫ్యూయల్ కూడా తీయొచ్చని తేల్చారు. జొన్నతో ప్లాస్టిక్ కూడా తీయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. జొన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంట్లోని ఐరన్, కాల్షియం, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. ఇది జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో కూడా తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అలాంటి జొన్న రొట్టేను కూడా కల్తీగాళ్లు వదలకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jowar Roti, Mahbubnagar