Telangana: మూర్ఛతో పడిపోయిన డ్రైవర్‌.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

ప్రతీకాత్మక చిత్రం

బస్సు భైంసా శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. ఒక్కసారిగా డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. అతడు స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పింది. రోడ్డు నుంచి కిందకు దిగి.. పంటల పొలాల్లోకి దూసుకెళ్లింది.

  • Share this:
    డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ఓ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజల్ నుంచి కొందరు నిర్మల్ జిల్లా భైంసాకు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. వారు భైంసాలోఅక్కడ శుభకార్యానికి హాజరు కావాల్సి ఉంది. ఐతే బస్సు భైంసా శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. ఒక్కసారిగా డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. అతడు స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పింది. రోడ్డు నుంచి కిందకు దిగి.. పంటల పొలాల్లోకి దూసుకెళ్లింది. ఐతే పొలాల్లోకి వెళ్లిన తర్వాత బస్సు అలాగే నిలబడిపోయింది.

    బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణ నష్టం సంభవించేది. బస్సు అలాగే నిలిచిపోవడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అనంతరం డ్రైవర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికుు షాక్ తిన్నారు. ఐతే ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వేరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    కాగా, ఏపీలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లారీ-మినీ బస్సు ఢీకొనడంతో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదురుగు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మృతులు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరు మదనపల్లి నుంచి ఆజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: