ప్రయాణికుల సామాన్లతో ఈ నెల 5న పరారైన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బస్సు ఓనర్లే దొంగలుగా పోలీసులు తేల్చారు. బస్సు డ్రైవర్, క్లీనర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ప్రయాణికుల లగేజీ, బస్సు, 18 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా బస్సు కేరళకు చెందిన బస్సు కావడంతో తెలంగాణ పోలీసులు.. కేరళ వరకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.కాగా "కేరళలో పని చేసే వలస కూలీలు మహారాష్ట్రలోని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇద్దరు టూరిస్ట్ ఏజెంట్లతో మాట్లాడి.. వారి ద్వారా మొత్తం 64 మంది ఒక ట్రావెల్ బస్సు మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్కరికి రూ.3500 చొప్పున ఇస్తామని చెప్పగా ఒప్పుకున్నారు. అయితే ఈ అమౌంట్‌తో సంతృప్తి చెందని బస్సు ఓనర్లు. అంత దూరం వెళ్తే.. తమకు ఏమీ లాభం లేదనుకున్నారు. కూలీలను మధ్యలోనే వదిలేయాలనే కుట్రకు తెరలేపారు..
బస్సు ఓనర్లు అనుకున్నట్టే కూలీలను.. తెలంగాణలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి శివారులో భోజనం చేయండని దింపారు. బస్సు రిపేరు ఉందని చెప్పి ప్రయాణికులను కట్టుబట్టలతో రోడ్డున పడేసి పోయారు. అయితే బస్సు కోసం సుమారు ఆరు గంటలపాటు వేచి చూసిన ప్రయాణికులు చివరకు మోసపోయామని గ్రహించి స్థానిక పోలీసులను ఆశ్రయించారు..దీంతో బాధితులందరికి తాత్కాలికంగా నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో రాత్రి బసకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. బస్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు. పారిపోయిన బస్ డ్రైవర్లు, స్విచ్ ఆప్ చేయడంతో వారిని వెంటనే పట్టుకునేందుకు పోలీసులకు కష్టంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్ననార్కట్పల్లి పోలీసులు..వారి కోసం కేరళ వెళ్లారు. నిందితులను గుర్తించి... నార్కట్‌పల్లికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికలు లగేజీతో పాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda police, Telangana