ఓ బస్సు డ్రైవర్ తోపాటు క్లీనర్ విచిత్రంగా వ్యవహరించారు. గమ్యానికి చేర్చాల్సిన ప్రయాణికులకు కట్టబట్టలతో మధ్యలోనే వదిలేసి బస్సుతో పాటు పరారయ్యారు. దీంతో అసోం వెళ్లాల్సిన వారు డబ్బు, బట్టలు లేక ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే..64 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావేల్ బస్సు కేరళ నుంచి అసోంకు బయలుదేరింది. అయితే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్దకు వచ్చేసరికి బస్సు ఆగిపోయింది. మరమ్మతు వచ్చిందని, రిపేరు చేయించుకుని వస్తామని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ప్రయాణికులకు చెప్పి, బస్సులో వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారు ఇక తిరిగి రాలేదు... బస్సు కోసం గంటల తరబడి వేచి చూశారు.. వెళ్లిన బస్సు మాత్రం వెనక్కి రాలేదు. మరోవైపు బస్సు డ్రైవర్ , క్లీనర్ ల సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.. అలా ఆరు గంటల పాటు వేచి చూసిన ప్రయాణికులు.. ఇక బస్సు రాదని అర్థమై లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే ప్రయాణికల దుస్తులు, నగదు, ఇతర సామాగ్రి అంతా బస్సులోనే ఉండటంతో ప్రయాణికులు కేవలం కట్టుబట్టలతో రోడ్డుపై ఉండిపోయారు. వారిలో అసోంకు చెందిన 59 మంది, బిహార్‌కు చెందిన ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కేరళ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకుని ఈ నెల 3న బయలుదేరారు. ఆదివారానికి అసోంకు చేరాల్సి ఉంది.
రిపేరు పేరుతో శుక్రవారం మధ్యాహ్నం నార్కట్‌పల్లిలోని చింతల్ వద్ద ఓ ప్రైవేటు హోటల్ వద్ద ప్రయాణికులను దించేసిన బస్సు సిబ్బంది, టైర్లు బాగు చేయించుకుని తిరిగి వస్తామని చెప్పి పరారయ్యారు. బాధితులు 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని వారికి భోజన సదుపాయాన్ని సమకూర్చారు. స్థానికంగా ఓ ఫంక్షన్హాల్లో వారికి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతకి ఆ బస్సు డ్రైవర్ ఎందుకు మధ్యలో వదలివేసి వేళ్లిపోయాడనేది తేలాల్సి ఉంది. అయితే పోలీసులు ప్రయాణికులు ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.