కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని కాంగ్రెస్ మండిపడ్డారు. తెలంగాణకు ఒక్కపైసా కూడా దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు, కేరళ, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు కేటాయించారన్న ఆయన.. అన్ని రాష్ట్రాలకు దక్కాల్సిన సొమ్మును కొన్ని రాష్ట్రాలకే పంచుతున్నారని విమర్శించారు. కేవలం ఎన్నికలున్న రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రైతులు 2 నెలలకు పైగా ఆందోళనలు చేస్తుంటే మద్దతు ధరపై ప్రకటన కూడా ఆయన చేయలేదని దుయ్యబట్టారు. ఉన్న ఆస్తులను అమ్మడం తప్ప.. కేంద్రం ఇంకేమీ చేయడం లేదని ఆయన అన్నారు. బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ ఏమీ ఒరగలేదని ఉత్తమ్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి దక్కింది సున్నా అని విమర్శించారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరతామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని.. ఆ ప్రాజెక్టుకు కూడా నిధులివ్వాలని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Telangana, Union Budget 2021, Uttam Kumar Reddy