ఈ 25 ఏళ్ల బీటెక్ కుర్రాడికి ఇదేం పాడు బుద్ధి.. హైదరాబాద్ లోని ఏటీఎం సెంటర్ల వద్ద..

ప్రతీకాత్మక చిత్రం

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల శివకుమార్ హైదరాబాద్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. వాస్తవానికి ఏదో ఒక కోర్సు నేర్చుకోవడమో, కోచింగ్ తీసుకోవడమో , ఉన్నతోద్యోగాలకు ప్రిపేర్ కావడమో అతడు చేయాలి. కానీ..

  • Share this:
    హైదరాబాద్ లో ఏటీఎం సెంటర్ల వద్ద జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఏటీఎం లోంచి ఎలా డబ్బులు తీయాలో తెలియని వారినే టార్గెట్ చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో మినీ సీక్రెట్ కెమెరాలను పెట్టి మరీ పిన్ నెంబర్లను తెలుసుకున్న క్రైమ్ స్టోరీలు గతంలో ఎన్నో జరిగాయి. మోసపోయే వాళ్లు ఉన్నన్నాళ్లు మోసాలు జరుగుతూనే ఉంటాయి, కొత్త మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారన్న చందంగా, హైదరాబాద్ లో తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏటీఎంల వద్ద వృద్ధులనే టార్గెట్ గా చేసుకుని వారి ఖాతాల్లోంచి డబ్బును మటుమాయం చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేటుగాడు 25ఏళ్ల యువకుడు కావడమే కాకుండా తాజాగా బీటెక్ పూర్తి చేసి ఉండటం గమనార్హం.

    మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల శివకుమార్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ప్రైవేటు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 2019లో అతడి చదువు పూర్తయింది. వాస్తవానికి ఏదో ఒక కోర్సు నేర్చుకోవడమో, కోచింగ్ తీసుకోవడమో , ఉన్నతోద్యోగాలకు ప్రిపేర్ కావడమో అతడు చేయాలి. కానీ అంత రిస్క్ దేనికి అనుకున్నాడో ఏమో కానీ, ఏకంగా మోసగాడిగా అవతారం ఎత్తాడు. అమాకయంగా నటిస్తూ, హైదరాబాద్ లోని వివిధ ఏటీఎం సెంటర్ల వద్ద పహారా కాస్తుంటాడు. అతడు ఉన్న సమయంలో ఎవరైనా వృద్ధులు ఏటీఎం వద్దకు వస్తే, వారి వెంటే నిల్చుంటాడు. ఏటీఎంలోంచి డబ్బులు ఎలా తీయాలో తెలియక వారు ఇబ్బందులు పడుతోంటే.. ’సాయం చేయమంటారా తాతగారు‘ అంటూ మాట కలుపుతాడు. నోరారా తాతా అన్న అతడి పిలుపుతో ఆ వృద్ధులు కూడా ఇతగాడి మాయలో పడిపోతారు. వాళ్లు ఎంత అడిగారో అంత డబ్బు తీసి ఇచ్చి, ఏటీఎంను ఇచ్చే టప్పుడు మాత్రం తనవద్ద ఉన్న నకిలీ ఏటీఎంను ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే ఏటీఎం పిన్ నెంబర్ ను కూడా తెలుసుకునేవాడు. వాళ్లు వెళ్లిపోగానే, తన వద్ద దాచుకున్న ఏటీఎంను ఉపయోగించి డబ్బును డ్రా చేసుకునేవాడు.

    అలా పెద్ద సంఖ్యలోనే మోసాలకు పాల్పడ్డాడు. మల్లాపూర్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసే 57ఏళ్ల ఉద్యోగిని కూడా ఇలాగే మోసం చేశాడు. అతగాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్ పై కేసును నమోదు చేశారు. అతడికోసం వెతుకుతుండగా నాచారంలో ఓ ఏటీఎం సెంటర్ వద్ద శివకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 90వేల రూపాయలతోపాటు 11 ఏటీఎం కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. మొత్తానికి ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ ఏటీఎం కేంద్రాల వద్ద దొంగగా మారడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
    Published by:Hasaan Kandula
    First published: