ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు విచారణను ఎదుర్కొన్న కవిత నవ్వుతూ బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపిస్తూ..పిడికిలెత్తి కారు ఎక్కారు. అయితే ఇవాళ్టి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠకు తెర పడింది. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి కాన్వాయ్ లో ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ప్రధానంగా సెల్ ఫోన్ల పైనే కవిత విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే రేపు విచారణ లేదని తదుపరి విచారణ తేదీని త్వరలో చెప్తామన్నారని కవిత లీగల్ టీం చెప్పినట్లు తెలుస్తుంది. కాగా నిన్న రాత్రి 9.10 నిమిషాల వరకు కవిత విచారణ కొనసాగగా ఇవాళ అంతకుమించి సమయం విచారణ కొనసాగింది.
ఈరోజు ఉదయం 11.30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత 10 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 9.40 నిమిషాలకు బయటకు వచ్చారు. మొత్తం 10 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సెల్ ఫోన్లపైనే ఇవాళ విచారణ సాగినట్లు తెలుస్తుంది. కాగా గతంలో కూడా సెల్ ఫోన్లు కీలకమని ఈడీ చెప్పిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో కవిత తన ఫోన్ లను ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆమె తన సెల్ ఫోన్లను ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకెళ్లారు. ఈ క్రమంలో మీడియాకు కూడా ఆ ఫోన్లను చూపించారు.
ఢిల్లీ ఈడీ ఆఫీస్ లోని 3వ ఫ్లోర్ లో కవితను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే కవిత విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను అధికారులు విచారిస్తున్న క్రమంలో లీగల్ టీంకు ఈడీ పిలుపునిచ్చారు. దీనితో కవిత లీగల్ టీం సోమాభరత్, దేవి ప్రసాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలను తీసుకొని వారు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి విచారణ మధ్యలో కవిత లీగల్ టీంను ఈడీ రప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ విచారణ అనంతరం ఆమె నవ్వుతూ బయటకు వచ్చారు.
కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈనెల 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరవ్వగా..సుమారు 8 గంటలకు పైగా అధికారులు విచారించారు. ఆ తరువాత నిన్న కూడా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా 10 గంటలు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 30 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. అయితే ఆమె విచారణ ఇంతటితో ముగిసిందా? లేక రేపు కూడా విచారణకు హాజరవ్వాలా? లేక మరికొన్ని రోజులకు విచారణకు రావాలని నోటీసులిస్తారా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana