Nizamabad : డబ్బు కోసం బావ వేధింపులు.. సోదరితో కలిసి బావను కొట్టి చంపిన బావమరుదులు

డబ్బు కోసం బావ వేధింపులు..సోదరితో కలిసి బావను హత్య చేసిన బావమరుదులు

Nizamabad : బావమ‌రుదులు అంటే బావ బతుకు కోరతారని అంటారు.. సోద‌రి భ‌ర్త‌ను ఎంతో గౌర‌వంగా చూస్తారు.. ఇది సాంప్ర‌దాయంగా కూడా వ‌స్తుంది.. కాని ఇందుకు విరుద్దంగా బావమరుదులు వ్వవహరించారు. తన చెల్లెలితో కలిసి బావపై దాడి చేశారు. తన చెల్లెలిని వేదిస్తున్నాడంటూ కర్రలు, ఇటుకలతో కొట్టి చంపారు.

  • Share this:
న్యూస్18తెలుగు ప్ర‌తినిదిః పి మ‌హేంద‌ర్

వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్ కాలనీకి చెందిన ప్రవీణ్(39), లావణ్య దంపతులు. ప్ర‌వీణ్ ఓ బీడి కంపెనీలో మునీర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే గ‌త కొంత కాలంగా ప్ర‌వీణ్, భార్య లావణ్య మధ్య గొడవలు జ‌రుగుతున్నాయి.. ఇలా చాలా సార్లు గొడవలు జరిగి కౌన్సిలింగ్ వరకు కూడా వెళ్లారు..

ఈ క్రమంలోనే ప్రవీణ్‌ వేధింపులు ఎక్కువయ్యాయి..అయినా లావణ్య కుటుంబ సభ్యులు ఓపిక పట్టారు. దీంతో ప్రవీణ్ మరింత రెచ్చిపోయాడు. ఈ సంధర్బంలోనే వారం రోజుల క్రితం లావణ్య అన్నదమ్ములు ముగ్గురు వారి స్వంత భూమిని విక్రయించారు. దీంతో ప్రవీణ్ దృష్టి డబ్బుమీద పడింది. తనకు డబ్బులు తీసుకురావాలంటూ లావణ్యపై మరింత ఒత్తిడి పెంచాడు. అప్పటికే ఇద్దరి మధ్య ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలోనే డబ్బులు అడగడంతో అగ్నికి అజ్యం పోసినట్టైంది..

ఇలా రోజు డబ్బుల కోసం లావణ్యపై తీవ్రం ఒత్తిడి పెంచడంతో ఆమె తన అన్నదమ్ములకు విషయం వివరించింది. దీంతో ఇదే విషయం అడగడానికి వారు కుటుంబసభ్యులతో కలిసి తన ప్రవీణ్ ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టారు. పంచాయితీలో ఇరు కుటుంబాల మధ్య సమన్వయం కోల్పోయి..ఘర్షణకు దారి తీసింది.. అప్పటికే తన చెల్లెల్ని వేధింపులకు గురి చేయడంతో సహనం కోల్పోయిన లావణ్య అన్నదమ్ములు ప్రవీణ్‌‌పై మూకుమ్మడి దాడి చేశారు. కర్రలు, ఇటుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మరోవైపు భర్త వేధింపులకు విసిగిపోయిన లావణ్య సైతం తన సోదరుల వైపు నిలబడింది. ఆమె సైతం తన భర్తపై దాడి చేసింది.. మూకుమ్మడి దాడిలో తీవ్రగాయాలపాలైన ప్రవీణ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

భార్యభర్తల మధ్య ఘర్షణలు తగదాలు సాధారణంగా వస్తాయి..వీటిని ఆయా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు సర్థిచెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ వేధింపులు ఎక్కువైతే చివరకు పెద్దమనుషులను లేదా...చివరకు పోలీసుస్టేషన్‌కు వెళ్లి పరిష్కరించుకుంటారు.కాని కొద్ది మంది క్షణికావేశానికి పోయి సాటి మనిషిని చంపడం విషాదమే అయినా..తనది కాని సంపాదన కోసం భార్యలను వేధింపులకు గురి చేయడం కూడా సరైన పద్దతి కాదు.ఏది ఏమైనప్పటికి క్షణికావేశంలో ఓ నిండు ప్రాణం బలికావడంతోపాటు కుటుంబసభ్యులు జైలుకు వెళ్లడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపినట్టయింది.
Published by:yveerash yveerash
First published: