Home /News /telangana /

BRIDE GROOM ASKED CM KCR TO REMOVE FACE MASK IN A WEDDING TELANGANA CM SHARES INTERESTING THINGS IN SIDDIPET SK

CM KCR: అతడు నన్నే మాస్క్ తీయమన్నడు..అందుకే కరోనా వచ్చింది.. సీఎం కేసీఆర్ పంచ్‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణలోని నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్‌, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్ల వెల్లడించారు.

  సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా.. బహిరంగ సభలో మాట్లాడినా.. ఎంతో మంది ఆసక్తిగా వింటారు. ప్రసంగంలో ఎక్కడా బోర్ కొట్టకుండా పంచ్‌లు వేస్తారు. జోకులు పేల్చుతారు. సభా వేదికపై ఉన్న పెద్దలతో పాటు పాటు జనాలను కూడా కడుపుబ్బా నవ్విస్తారు. తాజాగా సిద్దిపేట పర్యటనలోనూ ఇలాంటి సన్నివేశమే కనిపించింది. తాను ఇటీవల ఓ పెళ్లికి వెళ్తే పెళ్లికొడుకు తననే మాస్క్ తీయమన్నాడని పంచ్‌లు విసిరారు సీఎం కేసీఆర్. అందుకే తనకు కూడా కరోనా వచ్చిందని చెప్పుకొచ్చారు. ‘నేను ఓ పెళ్లికి పోయిన. నేను మాస్క్‌ వేసుకొని ఉంటే.. సార్ మాస్క్ తీయండి ప్లీజ్ అని పెళ్లి పిల్లగాడు అడిగాడు. ఎందుకయ్యా అని నేను అడిగితే.. సార్ మీరు మళ్లీ దొరుకుతారో లేదో ఒక ఫొటో తీసుకుంటానని చెప్పిండు. నేను నీకు దొర్కుతనో లేదో గానీ, నేను మత్రం కరోనాకు దొరుకుత కదరా బై అని చెప్పాను. ఆఖరికి వాడుగుంజా.. వీడు గుంజా నాక్కూడా కరోనా వచ్చింది.' అని ఓ పెళ్లిలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన మాటలకు మంత్రి హరీష్‌రావుతో పాటు అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు.

  అంతకుముందు సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్..తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందని గుర్తుచేశారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట అండగా ఉందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోనే తాను పుట్టి పెరిగాని, ఇక్కడే తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


  పాలనా సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాలు వేగంగా ప్రజలకు అందాలనే మంచి ఉద్దేశంతోనే సంస్కరణలు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని తరాలు నష్టపోతాయన్న ఆయన... అందుకే రాష్ట్రం వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యతగా విద్యుత్‌ సమస్యను పరిష్కరించామని చెప్పారు. మంచినీళ్ల సమస్య లేకుండా మిషన్‌ భగీరథను ప్రారంభించామని చెప్పారు. దేశంలో ఎక్కడా రైతు బీమా లేదని.. రైతు బంధు ఇచ్చిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణే అని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. ఈ సభా వేదికగా పలు కీలక ప్రకటనలు చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలోని నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్‌, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్ల వెల్లడించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Corona virus, Face mask, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు