కరోనా మహమ్మారి వల్ల పండగలను ఇంట్లోనే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. ఐతే ప్రస్తుతం లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఉన్నప్పటికీ బోనాల పండగపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే ఆషాడ బోనాలను.. ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భక్తులెవరూ బోనాలను ఆలయాలకు తీసుకెళ్లవద్దని సూచించారు. ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారని చెప్పారు తలసాని.
బోనాల పండగ నిర్వహణపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీపీ మహేష్ భగవత్, జీహెచ్‌ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈసారి ఎవరి ఇళ్లల్లో వారే పండగను జరుపుకోవాలని చెప్పారు. ఘటాల ఊరేగింపును పూజారులే నిర్వహిస్తారని.. అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా వారే సమర్పిస్తారని వెల్లడించారు. ప్రజలెవరూ ఆలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి తలసాని.
హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 70శాతం పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని.. అలా జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Talasani Srinivas Yadav