హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bollaram Fire Accident: బాంబులా పేలిన రియాక్టర్.. ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారు?

Bollaram Fire Accident: బాంబులా పేలిన రియాక్టర్.. ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారు?

ఫ్యాక్టరీలో మంటలు

ఫ్యాక్టరీలో మంటలు

Bollaram Fire Accident: ఫ్యాక్టరీలో షిప్ట్‌కు 50 నుంచి 60 మంది పనిచేస్తారని తెలిసింది. ఐతే ప్రమాద సమయంలో చాలా మంది లంచ్ చేసేందుకు వెళ్లడంతో.. పెను ప్రమాదం తప్పిందని కొందరు స్థానికులు వెల్లడించారు

హైదరాబాద్ శివారులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో కెమికల్ రియాక్టర్ పేలింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 మంది క్షతగాత్రులను బాచుపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఐతే ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఇంకా మంటలు వ్యాపిస్తున్నందున రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. వారు లోపలికి వెళితేనే అసలు ఎంత మంది కార్మికులు ఉన్నారన్న దానిపై క్లారిటీ వస్తుంది.

మొదట ఒక రియాక్టర్ బాంబులా పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు వ్యాపించి మరో రియాక్టర్ కూడా పేలిందని.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు, పొగలు అలుముకున్నాయని తెలిపారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని.. పేలుడు ధాటికి రాళ్లు ఎగిరిపడి కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో షిప్ట్‌కు 50 నుంచి 60 మంది పనిచేస్తారని తెలిసింది. ఐతే ప్రమాద సమయంలో చాలా మంది లంచ్ చేసేందుకు వెళ్లడంతో.. పెను ప్రమాదం తప్పిందని కొందరు స్థానికులు వెల్లడించారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని పేర్కొన్నారు. ఐతే అసలు ఎంత మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారన్నది.. రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళితేనే తెలియనుంది.

మధ్యాహ్నం భారీ శభ్దాలతో రియాక్టర్ పేలిపోవడంతో.. కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బయటకు పరుగులు తీసే క్రమంలో కొందరు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరికొందరు దట్టమైన పొగలతో శ్వాస ఆడక సొమ్మసిల్లి పడిపోయారు.

మరోవైపు ఫ్యాక్టరీ చుట్టుపక్కల దట్టమైన పొగలు ఇంకా వ్యాపించడంతో.. స్థానిక ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఇళ్లను ఖాళీ చేసి వేరొక ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై తర్వాత దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐడీఏ బొల్లారం పరిధిలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

First published:

Tags: Fire Accident, Telangana

ఉత్తమ కథలు