Telangana News: మసకబారుతున్న ‘కంటివెలుగు’ పథకం.. ఫలితం చూపని కళ్లజోళ్లు.. పెరుగుతున్న బాధితులు..

ప్రతీకాత్మక చిత్రం

Telangana News: కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాలతో దుమ్ముగూడెంలో అక్కడి పోలీసులు ఓ కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా ఈ శిబిరానికి మూడు వేల మందికి పైగా ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మెజారిటీ వారికి కాటరాక్ట్‌ (కంటి శుక్లం) ఆపరేషన్‌ అవసరం అని వైద్యులు గుర్తించారు.

 • Share this:
  (G.SrinivasReddy,News18,Khammam) 

  కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాలతో దుమ్ముగూడెంలో అక్కడి పోలీసులు ఓ కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా ఈ శిబిరానికి మూడు వేల మందికి పైగా ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మెజారిటీ వారికి కాటరాక్ట్‌ (కంటి శుక్లం) ఆపరేషన్‌ అవసరం అని వైద్యులు గుర్తించారు. కానీ ఎవరు చేయాలి..? కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకునే స్థితిలో అక్కడి ప్రజలు లేరు. జిల్లాలో రెండు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. అక్కడ కంటి వైద్య నిపుణులు ఉన్నప్పటికీ ఎవరూ ఆపరేషన్ల ఊసు ఎత్తడం లేదు. కనీసం ప్రభుత్వాసుపత్రుల్లో కంటి వైద్యం చేస్తారన్న విషయంపై జనానికి అవగాహన సైతం లేదంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి దుస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక ప్రభుత్వ అధికారో.. లేక ఏదైనా స్వచ్ఛంద సంస్థో ముందుకొచ్చి సర్వే లేదా పరీక్షలు చేస్తే తప్ప తమకు కనీసం కంటి సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోలేని దుస్థితిలో ప్రజలున్నారు.

  100 Years Old Love Letter: వెలుగులోకి వంద సంవత్సరాల క్రితం నాటి ప్రేమ లేఖ.. అందులో ఏం రాసి ఉందో తెలుసా..?


  సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. మనిషి శరీరంలో ఏభాగం సక్రమంగా లేకపోయినా కొంత మేర సర్దుకుపోవచ్చు. కానీ కంటి చూపు లేకపోతే జీవితమే అంధకారంగా మారుతుంది. చాలా మంది పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఇప్పటికీ కంటి సమస్య పెద్ద సీరియస్‌ సమస్య కానేకాదు. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఉదాసీన వైఖరి ప్రజల్లో కనిపిస్తోందని వైద్యాధికారులే చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'కంటివెలుగు' పథకం అమలులో భాగంగా నిర్వహించిన ప్రాథమిక స్క్రీనింగ్‌ పరీక్షల్లో ఇదే దుమ్ముగూడెం పీహెచ్‌సీ పరిధిలో మూడేళ్ల క్రితం 9098 మంది పరీక్షలు చేయించుకున్నారు.

  వీరిలో 2448 మందికి కళ్లజోళ్లు అందించగా, 904 మందికి మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారు. మరో పీహెచ్‌సీ అయిన నర్సాపురం పరిధిలో 7200 మందికి పరీక్షలు నిర్వహించగా, 3600 మందికి కళ్లజోళ్లు అందించారు. 150 మందికి మెరుగైన వైద్యం అవసరం అని సిఫారసు చేశారు. పర్ణశాలలో 6300 మంది పరీక్షలు చేయించుకోగా, 4636 మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. మరో 152 మందికి శుక్లం విషయమై వైద్యానికి సిఫారుసు చేశారు. ఇలా ఒక్క దుమ్ముగూడెం మండలంలోనే 22,598 మంది పరీక్షలు చేయించుకోగా, 10,684 మందికి కళ్లజోళ్లు అందాయి. 1206 మందికి కాటరాక్ట్‌ ఆపరేషన్లకు సిఫారసు చేయగా, ఇప్పటికీ ఎలాంటి ఆపరేషన్లు చేయలేదు. అసలు ఈ మండలంలో ఉన్న జనాభా 46,802 కాగా, కంటి సమస్యలున్నట్టు గుర్తించి పరీక్షలకు వచ్చింది 22,598 మంది.. అంటే సగానికి సగం జనాభా కంటి సమస్యలతో సతమతం అవుతున్నట్టు అధికారులు అంచనా వేశారు.

  ‘‘ఓట్లు కొనే అడ్డగాడిదలను దయచేసి అసెంబ్లీకి పంపకండి.. పిల్లల భవిష్యత్తును ఉరితీయకండి’’.. అంటూ..


  అయితే మెరుగైన వైద్యం మాత్రం అందని దైన్యం ఉంది. ఆర్భాటంగా ప్రారంభమైన కంటివెలుగు పథకం మాత్రం కేవలం అంకెలకే పరిమితం అవుతోంది. దీనికి తోడు ఈ పథకంలో భాగంగా నిర్వహించిన టెస్టుల్లో హ్రస్వం ఎంత ఉన్నా.. ఫిక్స్‌డ్‌గా ముందుగానే తయారు చేసిన కళ్లజోళ్లను అందించారు. ఇది కూడా ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్‌ కాకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. కళ్లజోడు తీసుకుని వాడుతున్న వారిలోనూ పెద్దగా నాణ్యమైన చూపు లభించని పరిస్థితి ఉంది. పథకం ఉద్దేశం మంచిదే అయినా ఆచరణలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. సహజంగా ఏభై ఏళ్లు దాటిన వారికి కాటరాక్ట్ (కంటి శుక్లాలు) ఫాం అవుతుంటాయి. వాళ్లు ఏదో ఒక చోట ఆపరేషన్‌ చేయించుకోవాలి. కంటివెలుగులో ఆపరేషన్‌ సౌకర్యం ఉన్నా, రెండేళ్లుగా కరోనా వల్ల ఆపరేషన్లు ఆగిపోయాయి.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  దీంతో పీహెచ్‌సీలకు కూడా కంటి వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. భద్రాచలం, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు ఉన్నా, ఆధునిక పరికరాలు ఉన్నా ఆపరేషన్లు చేయడం లేదు. క్షేత్ర స్థాయిలో కంటి సమస్యలు ఉన్న కేసులు ఉన్నా.. ఆపరేషన్లు చేసే వాళ్లు లేక ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఆపరేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికితోడు ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అసలు కంటి సమస్యలు ఉంటాయన్న అంశమే తెలియని దుస్థితి ఉంటుంది. వీరిలో చైతన్యం తేవాల్సిన అవసరం కూడా ఉంది.
  Published by:Veera Babu
  First published: