హైదరాబాద్ శివారులో భారీ పేలుడు.. కి.మీ. మేర దట్టమైన పొగలు

సొమ్మసిల్లి పడిపోయిన కార్మికులు

ఫ్యాక్టరీలో కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఐతే భారీ మంటలు, దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేనే.. లోపల ఎంత మంది ఉన్నారు? అనే దానిపై క్లారిటీ వస్తుంది.

 • Share this:
  హైదరాబాద్ (Hyderabad) శివారులో భారీ పేలుడు సంభవించింది. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. భారీ శభ్దాలతో పేలుడు జరగడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బయటకు పరుగులు తీసే క్రమంలో కొందరు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరికొందరు దట్టమైన పొగలతో శ్వాస ఆడక సొమ్మసిల్లి పడిపోయారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  ఇప్పటి వరకు 10 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే భారీ మంటలు, దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరికొన్ని రియాక్టర్లు కూడా పేలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేనే.. లోపల ఎంత మంది ఉన్నారు? అనే దానిపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ లోపల ఎవరైనా చిక్కుకుంటే.. వారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  ఫ్యాక్టరీ చుట్టుపక్కల దట్టమైన పొగలు ఇంకా వ్యాపించడంతో.. స్థానిక ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఇళ్లను ఖాళీ చేసి వేరొక ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై తర్వాత దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐడీఏ బొల్లారం పరిధిలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: