బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో జీహెచ్ఎంసీకి సంబంధించిన అంశాలే లేవని అన్నారు. ఏ సమస్యలు ఏ ప్రభుత్వం పరిధిలో ఉన్నాయో తెలియకుండా బీజేపీ వాగ్ధానాలు చేస్తున్నదని విమర్శించారు. ఎల్ఆర్ఎస్, పోలీస్, విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయన్నారు. ఎన్నికల తర్వాత ఫడ్నవీస్ ప్రకటించిన హామీలతో తమకు సంబంధంలేదని చెప్పడానికే బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నాలుగు ఓట్లకోసం బీజేపీ నేతలు కక్కుర్తి పడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు బాధ్యత, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వరదలతో ముంబై అతలాకుతలం అయ్యిందని మంత్రి తలసాని గుర్తు చేశారు. హైదరాబాద్కు వరదలొస్తే ప్రధాని మోదీ పైసా సాయం చేయలేదని విమర్శించారు. రేపు హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీతో వరద బాధితులకు రూ.25 వేలు సాయం చేస్తామని జీవో ఇప్పిస్తారా ? అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే చేసిన, చేస్తున్న పనులనే భవిష్యత్లో చేస్తామని బీజేపీ వాగ్ధానాలు చేస్తున్నదని విమర్శించారు. విపత్తుల నిర్వహణ శాఖ కిషన్ రెడ్డి పరిధిలో ఉన్నప్పటికీ ఎలాంటి సాయం తీసుకురాలేదన్నారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను ముట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదని మంత్రి తలసాని హెచ్చరించారు. రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగుతుందని సాయంత్రం 4 గంటలలోపు గ్రేటర్ హైదరాబాద్లోని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad - GHMC Elections 2020, Talasani Srinivas Yadav, Telangana