జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. మేయర్ పీఠాన్ని సొంతంగా దక్కించుకునే స్థాయిలో మెజార్టీ రాకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో మేయర్ సీటును దక్కించుకోవడం ఎలా అనే దానిపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎక్స్అఫిషియో సభ్యులను కలుపుకుని మేయర్ సీటును దక్కించుకోవాలంటే 98 మేజిక్ ఫిగర్‌ను చేరుకోవాలి. అయితే ఈసారి ఈ సంఖ్యకు కొద్ది దూరంలోనే ఆగిపోయింది టీఆర్ఎస్. దీంతో మేయర్ సీటును దక్కించుకోవడం ఎలా అనే దానిపై టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. అయితే ఇందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉండటంతో.. ఆ పార్టీ ఏం చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఉంది. ఇరు పార్టీల మధ్య పాత స్నేహం కూడా ఉంది. అయితే ఈ రెండు పార్టీలు మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఒకవేళ టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని పొందేందుకు ప్రత్యక్షంగానే, పరోక్షంగానే ఎంఐఎం మద్దతు తీసుకుంటే.. ఆ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. గ్రేటర్‌లో పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ మెజార్టీ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ చేసిన ఈ విమర్శలను టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.
అయితే ప్రస్తుతం గ్రేటర్‌లో మేయర్ సీటు దక్కించుకోవాలంటే ప్రత్యక్షంగానే, పరోక్షంగానే ఎంఐఎం సాయం తీసుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్‌కు ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. బీజేపీ టీఆర్ఎస్‌పై మరింతగా రాజకీయ దాడి చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గ్రేటర్ మేయర్ సీటును మరోసారి సొంతంగానే దక్కించుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. అందుకు ఈసారి ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC Election Result, MIM, Telangana, Trs