హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్ఎస్ నిర్ణయం కోసం బీజేపీ వెయిటింగ్... ఆ తరువాతే ముందడుగు

Telangana: టీఆర్ఎస్ నిర్ణయం కోసం బీజేపీ వెయిటింగ్... ఆ తరువాతే ముందడుగు

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar By Election: ఈ ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ముందుకు సాగుదామనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వం చాలా రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రాజకీయాల్లో ముందుగా ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసిన తరువాతే తమ వ్యూహం ఏ రకంగా ఉండాలనే దానిపై రాజకీయ పార్టీలు ఓ అంచనాకు వస్తుంటాయి. తెలంగాణ రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. కొంతకాలంగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. తాము బలపడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించి టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని చూస్తోంది. అయితే నాగార్జునసాగర్‌లో తాము గెలవడంతో పాటు బీజేపీ బలం పుంజుకోకుండా చూడాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని సమాచారం. అందుకే ఈ ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ముందుకు సాగుదామనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వం చాలా రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపుతారనే దానిపై టీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వడం లేదు. నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టికెట్ ఇస్తారా లేక గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి వంటి వారిని రేసులో నిలుపుతారా లేక యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడిని తెరపైకి తీసుకొస్తారా అన్నది తేలాల్సి ఉంది.

సాగర్ బరిలో దిగబోయే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో... తాము ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ ఓ స్పష్టతకు రాలేకపోతోందని సమాచారం. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నివేదితా రెడ్డి మళ్లీ ఇక్కడి నుంచి తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. మరో నేత అంజయ్య కూడా పోటీలో ఉంటానని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జానారెడ్డి అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి పేరును కూడా బీజేపీ పరిశీలిస్తోందని సమాచారం.

అయితే టీఆర్ఎస్ ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపుతుందనే అంశం తేలిన తరువాతే తాము ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జునసాగర్‌లో తమ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే దానిపై ఆ పార్టీ నియోజకవర్గంలో పలు సర్వేలు కూడా చేయించుకుంటోందని తెలుస్తోంది. అయితే ఈ సర్వే లెక్కలు ఎలా ఉన్నా.. టీఆర్ఎస్ నిర్ణయం తరువాతే ఈ విషయంలో ముందడుగు వేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Bjp, Nagarjuna Sagar By-election, Telangana, Trs

ఉత్తమ కథలు