BJP VIJAY SANKALP SABHA PM NARENDRA MODI SLAMS CM KCR AND KTR TELANGANA GOVERNMENT HERE IS MODI SPEECH SK
PM Narendra Modi: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi Speech: బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో హోంమంత్రి అమిత్ షా, పీయుష్ గోయెల్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఆ దిశగా ప్రజలే మార్గం ఏర్పరుస్తున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతోందో వివరించారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. సభకు వచ్చిన జనం ఉత్సాహాన్ని చూసి ఫిదా అయ్యారు. తెలంగాణ మొత్తం పరేడ్ గ్రౌండ్‌లోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)ను ప్రధాని మోదీ ఒక్క మాట కూడా అనలేదు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో... సభా వేదికగా ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా వెల్లడించారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరి నా నమస్కారాలు. రెండు రోజులు మేమంతా ఇక్కడే ఉన్నాం. మీరు చూపిన ప్రేమ మరవలేనిది. దేశ ప్రజల ఆకాంక్షాలను నెరవేర్చడానికి బీజేపీ అహర్నిశలు కష్టపడుతోంది.
తెలంగాణలో కళ, కౌశలం , పనితనం పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాద్రిలో శ్రీరాముడి నుంచి యాదాద్రిలో నరసింహుడి వరకు, అలంపూర్ జోగులాంబ నుంచి వరంగల్‌లో భద్రకాళి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలున్న పవిత్రమైన భూమి ఇది.
రామప్ప మందిరం నుంచి కాకతీయ తోరణం వరకు.. తెలంగాణ శిల్పకళ ఎంతో వైభవమైనది. ప్రతాప రుద్రుడి నుంచి కొమ్రంభీ వరకు.. ఇది వీరులను కన్న భూమి. ధైర్య పరాక్రమాల పుణ్యభూమి తెలంగాణ.
ఆత్మ నిర్భర్ రోడ్డు మ్యాప్‌తో మేం పనిచేస్తున్నాం. సబ్ కా సాథ్, సబ్ వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ నలుమూలలా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది.
కరనా సంక్షోభ సమయంలో ప్రజలందరికీ ఉచితంగా రేషన్ ఇచ్చాం. ఉచితంగా కరోనా టీకాలను అందించాం. ఉజ్వల పథకం ద్వారా ఎంతో మంది తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది. కేంద్ర పథకాలు ప్రతి గ్రామానికీ వెళ్లాయి.
బీజేపీపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల్లో ఉన్న మద్దతు.. ఇక్కడున్న యువతను చూస్తే అర్ధమవుతోంది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన ఫలితాలను ఇచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణలో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రజలే దారులు వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాలను తెరిచాం. తెలంగాణలో కూడా ఇచ్చాం. అందులో 50శాతం మహిళలే ఉన్నారు. ముద్ర లోన్లు కూడా ఎక్కువశాతం మహిళలకే వస్తున్నాయి. మహిళల సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చాం.
తెలంగాణ రైతుల జీవితాలను మార్చాలని మేం అనుకుంటున్నాం. రైతులకు మద్దతు ధర ఇచ్చి పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిచాం.
హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లకు నిధులిచ్చాం. నగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం. జాతీయ రహదారులను రెట్టింపు స్థాయిలో నిర్మిస్తున్నాం. చిన్న చిన్న గ్రామాలతో అద్భుతమైన రోడ్లతో అనుసంధానిస్తున్నాం.
తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సహకారం అందించాం. రాష్ట్రంలో అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్క్‌ని ఏర్పాటు చేయబోతున్నాం. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వేలాది యువతకు ఉపాధి లభిస్తుంది.
తెలంవగాణకు కొత్త రైల్వే లైన్లను మంజూరు చేశాం. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తాం. ప్రతి పల్లె రూపురేఖలను మార్చుతాం.
తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. తెలుగులో మెడికల్,టెక్నాలజీ చదువులు ఉంటే ఎంతో బాగుంటుందో ఆలోచించండి.
బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో హోంమంత్రి అమిత్ షా, పీయుష్ గోయెల్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. గత ఎనిమిదేళ్లలో ఏం చేశాం? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో మాత్రమే చెప్పారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి ఆయన గురించే మాట్లాడారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.