తెలంగాణలో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది. తాము రాముడు, కృష్ణుడును నమ్మబోమని, పెద్దలకు పిండ ప్రదానాలు లాంటివి కూడా చేయబోమంటూ కొందరు ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ప్రవీణ్ కుమార్ కూడా చేతులు చాచి ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందువుల విశ్వాసాలను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతల పట్ల విషం కక్కుతూ ప్రతిజ్ఞ చేసిన ప్రవీణ్ కుమార్‌పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వాసాలను గాయపరిచాడని ధ్వజమెత్తారు. స్వైరోస్‌పై పలు ఆరోపణలు వస్తున్నా గురుకుల విద్యావ్యవస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సుదీర్ఘ కాలం ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందో సమాధానం చెప్పాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యావ్యవస్థకు మరో ఐఏఎస్ అధికారిని నియమించాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.
‘తెలంగాణలో బాద్యతాయతమైన ఓక IPS అధికారిగా ఉండి చిన్న పిల్లల మెదడులల్లో విషబీజాలు నాటుతున్నారు? ప్రవీణ్ కుమార్ గారు ఇదేనా మీరు ఐపీఎస్ లో శిక్షణ పొందింది? బహిరంగంగా హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి.’ అని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.