విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల బండి సంజయ్ కీలక నిర్ణయం..

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. సాంకేతికత, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ జనం జేబులకు చిల్లులు పెట్టడం ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.

 • Share this:
  కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలపై పడిన విద్యుత్ భారం విషయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నాకు నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ధర్నాకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అయితే విద్యుత్‌ సౌధ ముందు నిర్వహించే ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌, రాష్ట్ర కోర్‌ కమిటీ నాయకులు మాత్రమే పాల్గొనున్నారు.

  జిల్లాల్లో జరిగే ధర్నాలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కోర్‌ కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొనాలని సంజయ్ సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలపనున్నట్టు బండి సంజయ్‌ ప్రకటించారు. అదేవిధంగా సోమవారం నిర్వహించే ధర్నాలో కార్యకర్తలు ఎవరూ పాల్గొనవద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. సాంకేతికత, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ జనం జేబులకు చిల్లులు పెట్టడం ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.

  పేద, మధ్యతరగతి ప్రజలపై కేసీఆర్‌ సర్కారు దోపిడీ మానుకోవాలని హితవు పలికారు. ప్రజలపై పడిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, వినియోగదారులకు మాఫీ చేయాలని, లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక, కిరాయిలు లేక కార్మికులు, యజమానులు అందరూ నష్టపోయారని వివరించారు.
  Published by:Narsimha Badhini
  First published: