(కట్టా లెనిన్, న్యూస్18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) ఐదవ విడత నిర్మల్ (Nirmal) జిల్లాలో కొనసాగుతోంది. ఐదవ విడత పాదయాత్ర ఐదవ రోజు నిర్మల్ జిల్లా కుంటాల మండలం మీదుగా కొనసాగింది. యాత్ర సందర్భంగా తమ గ్రామనికి వచ్చిన బండి సంజయ్ కు మహిళలు తిలకం దిద్ది, మంగళ హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న మార్గంలో ఎదురుగా వస్తున్న విద్యార్థులు, రైతులకు అభివాదం చేస్తూ, పలకరిస్తూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, పార్టీ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వెంట నడుస్తున్నారు. మార్గమధ్యలో బండిని కలుస్తున్న యువకులే కాకుండా రైతులు కూడా అభిమానంతో బండి సంజయ్‌తో సెల్పీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. అటు సంజయ్ కూడా అడిగిన వారిని కాదనకుండా సెల్ఫీలు దిగుతూ ముందుకుసాగుతున్నారు.
ఇదిలా ఉంటే పలు నాటకీయ పరిణామాల నడుమ బండి సంజయ్ పాద యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుండి బండి సంజయ్ తలపెట్టిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకావాల్సి ఉండగా, శాంతిభద్రతల కారణంగా పోలీసులు ఈ యాత్రకు అనుమతిని నిరాకరించారు. యాత్ర ప్రారంభం సందర్భంగా బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. చివరకు ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో కోర్టు నిబంధనలకు లోబడి బండి తన పాద యాత్రను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లిలోని పోచమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం తన యాత్రను ప్రారంభించారు.
కాగా, గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆయా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నా ముందుకు సాగుతున్నారు. మరోవైపు బండి సంజయ్ తన దైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కేసిఆర్ పేరుకు సరికొత్త నిర్వచనం కూడా చెప్పారు. కేసిఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ తెలంగాణలో రజాకార్ల పాలనను చూపిస్తున్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Bandi sanjay, Bjp, Telangana