పొలిటికల్ జోకర్ గా ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నా ప్రజాశాంతి పార్టీ చీఫ్, ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ ఏమాత్రం తగ్గడంలేదు. గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, చావుదెబ్బ తిన్న పాల్.. ఇప్పుడు తెలంగాణలోనూ పోటీకి సైఅంటున్నారు. ఇటీవలే గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సీఎం కేసీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నట్లు మీడియాకు చెప్పారు. ఆ వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే కేఏ పాల్ మరో బాంబు పేల్చారు. తనకు బీజేపీ పార్టీ ఉప ప్రధాని పదవి ఆఫర్ చేసిందని పాల్ క్లెయిమ్ చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, జగన్ కథ ముగియబోతున్నట్లు జోస్యం చెప్పారు. వివరాలివే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ దిగజారాయని, అధికార పార్టీలు పోటాపోటీగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. ప్రజల సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఏపీ, తెలంగాణలో అధికార, విపక్షాలు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సమయం గడిపేస్తున్నాయని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరికొన్ని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.
అభివృద్ధి కోసమే తాను గతంలో తెలంగాణకు మద్దతిచ్చానని, అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల పాలైందని కేఏ పాల్ అన్నారు. బీజేపీ తప్పులను ఎత్తిచూపుతోన్న కేటీఆర్.. టీఆర్ఎస్ తప్పిదాలను మాత్రం అంగీకరించడంలేదని, ఏపీలోనూ పరిస్థితి ఇలానే ఉందని, తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని, పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాల్ మండిపడ్డారు.
‘లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టాను. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడింది. బీజేపీ నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి, ఉప ప్రధాని పదవి ఇస్తానని ఆఫర్ చేసింది. కానీ నేను తిరస్కరించాను’అని కేఏ పాల్ చెప్పుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగికి ఇలాంటి ఆఫర్ ఒకటి బీజేపీ ఇచ్చినట్లు గతంలో ఎక్కడా వార్తలు రాలేదు. దీనిపై బీజేపీ నేతలు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే,
ఏపీ, తెలంగాణలో అన్ని పార్టీలూ డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నాయని, బడుగు బలహీనర్గాల ప్రజలు ఇప్పటికైనా అధికార పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజాశాంతి పార్టీ చీఫ్ అభ్యర్థించారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని చెప్పారు. ‘నా ప్రతిభ గురించి తెలిసే మోదీ, కేసీఆర్, జగన్ భయపడతారు. కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ ఇకనైనా గుర్తించాలి’అని కేఏ పాల్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో జగన్, కేసీఆర్ కథ ముగిసినట్లవుతుందన్న కేఏ పాల్.. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని, ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశానని, ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే తన అభిమతమని కేఏ పాల్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Ka paul, Praja shanti party, Trs, Ysrcp