తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు సాగర్ సీటు తమ సొంతం చేసుకోవడానికి కసరత్తు మొదలుపెట్టాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ఇచ్చిన బూస్టింగ్‌తో సాగర్ సీటును కూడా సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే నాగార్జునసాగర్‌లో బీజేపీకి అంత బలం లేదు. ఈ విషయం గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి అర్థమవుతోంది. అయితే ఈసారి చరిత్రను తిరగరాయాలని భావిస్తున్న బీజేపీ.. సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి సరికొత్త ఊపు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
తన పాదయాత్ర ద్వారా సాగర్‌లో బీజేపీ బలం పుంజుకోవడంతో పాటు పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రతో నియోజకవర్గం మొత్తం చుట్టడం ద్వారా అక్కడి ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. ఇప్పుడు పాదయాత్రకు అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సాగర్‌లో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్‌లకు పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారైన తరువాతే బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోవాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా సాగర్‌లో పార్టీకి ఊపు తీసుకురావాలని.. తద్వారా అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి.. సాగర్‌లో గెలిచి టీఆర్ఎస్పై మరోసారి పైచేయి సాధించాలని భావిస్తున్న బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.