news18-telugu
Updated: August 10, 2020, 3:12 PM IST
సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయకుండా కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జేపీ నడ్డా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆరేళ్లలో నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని.. అసలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.
కోవిడ్-19ను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారన్న ఆయన... హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులను తక్కుత సంఖ్యలో చేస్తున్నారని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల మాదిరిగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల తెలంగాణలో 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారని విమర్శించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని..ప్రజలు సహకరించాలని జేపీ నడ్డా కోరారు. కరోనాను ఎదుర్కోడంలో ప్రపంచానికే ప్రధాని మోదీ ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 10, 2020, 3:12 PM IST