హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka Bypoll: దుబ్బాక బైపోల్స్‌పై బీజేపీ ఫోకస్...పార్టీ అభ్యర్థిపై కసరత్తు

Dubbaka Bypoll: దుబ్బాక బైపోల్స్‌పై బీజేపీ ఫోకస్...పార్టీ అభ్యర్థిపై కసరత్తు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By Elections: దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.

  దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ను రామలింగారెడ్డి కుటుంబంతో పాటు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి కూడా ఆశించారు. అయితే రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన కుటుంబం కోరుతున్నా...స్థానిక పార్టీ నేతల సూచన మేరకు ఆయన భార్య సుజాతకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులు తమ అభ్యర్థులను ఖరారు చేసే వరకు వేచిచూడాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

  అటు దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కసరత్తు జరిపారు. నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై వారి సూచలు స్వీకరించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కనిపక్షంలో చెరకు శ్రీనివాస్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరొచ్చన్న ప్రచారం దుబ్బాక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. దీంతో అభ్యర్థి ఖరారు విషయంలో మరికొంతకాలం వేచిచూడాలని పీసీసీ పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  telangana bjp, dubbaka bjp
  ప్రతీకాత్మక చిత్రం

  అటు బీజేపీ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేలా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి, 2019లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు మళ్లీ టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటించి..ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘునందన్ రావు‌కు టికెట్ ఇవ్వడమేంటని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రఘునందన్ రావుకు టికెట్ కేటాయించే విషయంలో పార్టీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా పోటీ ఇచ్చేందుకు అభ్యర్థి విషయంలో  వ్యూహం మార్చవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రఘునందన్ రావుతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా దుబ్బాక టికెట్ రేసులో నిలుస్తున్నారు. టికెట్ కోసం ఒకరిద్దరు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

  raghunandanrao coments on muslims
  బీజేపీ నేత రఘునందన్ రావు(ఫైల్ ఫోటో)

  ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఇద్దరు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. వీరు నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు, పార్టీ నేతలను కలిసి పార్టీ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. పరిశీలకులు ఇచ్చే నివేదికను పార్టీ అధిష్టానానికి పంపి...ఆ తర్వాత టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. టికెట్ కోసం పార్టీలో పోటీ నెలకొంటున్నా...ఎం.రఘునందన్ రావుకు మళ్లీ టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana bjp

  ఉత్తమ కథలు