తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ద్వారా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని కొన్నేళ్లుగా చెబుతున్న బీజేపీ.. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయాన్ని నిరూపించడంలో విజయం సాధించింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని.. ఆ రకంగా టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే దుబ్బాక, గ్రేటర్‌తో పోలిస్తే నాగార్జునసాగర్‌లో అంతా బలం లేకపోవడం బీజేపీని టెన్షన్ పెడుతోంది. కానీ ప్రస్తుతం తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ పవనాలను ఉపయోగించుకుంటే.. నాగార్జునసాగర్‌లోనూ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది. అయితే నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి సవాల్‌గా మారింది. ఏదో సాదాసీదా అభ్యర్థిని బరిలో నిలిపితే.. మళ్లీ పాత కథ పునరావృతమవుతుందనే టెన్షన్ కమల దళంలో నెలకొంది.
అందుకే సాగర్‌లో ఎవరిని బరిలో నిలిపితే బాగుంటుందనే దానిపై ఆ పార్టీ అంతర్గతంగా పలు సర్వేలు చేపడుతోందని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్న బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాత తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం మేలు అనే భావనకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాగార్జునసాగర్‌లో కచ్చితంగా సత్తా చాటాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం భావిస్తోంది. సాగర్‌లో తడబడితే.. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో వచ్చిన ఊపు, కొత్త ఉత్సాహం తగ్గిపోతుందనే భావనలో కమలనాథులు ఉన్నారు.
అలా జరిగితే బీజేపీ గెలుపు గాలివాటం అని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన పడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఫలితాలు సాధించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు సాగర్‌లో అభ్యర్థి ఎంపికకు సంబంధించిన బీజేపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అనేక అంశాల వడపోత తరువాత ఇద్దరు, ముగ్గురు పేర్లను ఫైనల్ చేసిన బీజేపీ.. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని తమ అభ్యర్థిని ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.