అంశాలవారీగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ సవాళ్లు చేస్తుంటే.. కేంద్రం మాత్రం సైలెంటుగా రాష్ట్రానికి భారీ షాకిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పొందగోరిన అప్పులను కేంద్రం నిలిపేసింది. రాష్ట్రం అప్పులకు పూచీకత్తు(గ్యారంటీ) ఇచ్చేందుకూ మోదీ సర్కార్ వెనుకడుగువేసింది. కేసీఆర్ సర్కారు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అప్పులకు అనుమతించాలా? వద్దా? అనేది తర్వాత ప్రకటిస్తామని కేంద్రం తాపీగా చెప్పింది. అప్పులు పుట్టనిదే సంక్షేమ పథకాలు నడవని స్థితిలో కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాష్ట్రం అప్పులపై కేంద్రం పెత్తనమేంటని తీవ్రంగా నిరసించింది. ఆఫ్ బడ్జెట్ అప్పులనూ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం చెప్పడం దుర్మార్గమని, కక్షపూరితమని కేసీఆర్ సర్కారు ధ్వజమెత్తింది.
కేంద్రం తీరుపై బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్ర ఆక్షేపణలు చేస్తున్నదరిమిలా ఆర్థిక వ్యవహారాలు, అప్పులకు సంబంధించి తాజాగా జరిగిన కీలక సమావేశంలో కేంద్రం.. తెలంగాణకు కోలుకోలేని షాకిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, 2022-23 సంవత్సరానికి రుణాలు తీసుకునే విషయంలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా అనే అంశాలపై చర్చించారు. ఈక్రమంలో తెలంగాణ అప్పులపై కేంద్రం కొర్రీలు వేసింది.
తెలంగాణ ప్రభుత్వ అప్పులపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి గ్యారంటీ లభించకపోగా, అధికారులు ఇచ్చిన వివరణతో కేంద్రం సంతృప్తి చెందలేదనే సంకేతాలిచ్చింది. తెలంగాణ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అప్పులకు అనుమతించాలా వద్దా అనేది తర్వాత ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. కాగా, అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిరసించింది. అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం కక్ష సాధింపు చర్యలేనని ధ్వజమెత్తింది.
15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయనప్పటికీ.. ‘ఆఫ్ బడ్జెట్’(ప్రభుత్వ సంస్థలు గ్యారంటీ అప్పులు) అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తామనడం కక్షపూరితమని కేంద్రాన్ని తెలంగాణ విమర్శించింది. పైగా ఈ అప్పులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకుంటామని, ఈ నిబంధనను 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తామని అకస్మాత్తుగా ప్రకటించడం వివక్షగానే భావించాల్సి ఉంటుందనీ తెలంగాణ అధికారులు కేంద్రానికి తెలిపారు. కేంద్ర విధానాన్ని అనుసరిస్తూ గ్యారంటీ అప్పులను మూలధన వ్యయానికి వినియోగిస్తున్నామని, ఇది నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించింది.
ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి సేకరించే మార్కెట్ రుణాలకు కేంద్రం నుంచి కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి లభించడం లేదు. దీంతో ఏప్రిల్‌లో పొందాల్సిన రూ.3వేల కోట్ల రుణం, ఈ నెల 2న తీసుకోవాల్సిన మరో రూ.3వేల కోట్ల అప్పు చేజారాయి. కొత్త అప్పులను కేంద్రం నిలిపేసిన దరిమిలా తెలంగాణలో అమలవుతోన్న సంక్షేప పథకాల అమలు తీవ్రంగా ప్రభావితం కానుందనే అనుమానాలున్నాయి. అప్పుల నిలిపివేత విషయంలో తెలంగాణతోపాటు ఏపీ, కేరళకు కూడా కేంద్రం షాకులిచ్చింది.
తెలంగాణ, ఏపీ, కేరళ ప్రభుత్వాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుంటున్నాయని, వాటిని రాష్ట్రాలు తమ నిధుల నుంచి చెల్లిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ అన్నారు. అలాంటి అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని, వీటిని కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇలాంటి నిబంధనను 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ఈ రెండేళ్ల అప్పులను పరిశీలిస్తామని వివరించారు.
ఏ రాష్ట్రమైనా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటిందా అన్నది చూస్తామని, అనంతరం 2022-23ఆర్థిక సంవత్సరానికి అప్పులు తీసుకోవడానికి అనుమతించాలా వద్దా అనేది ప్రకటిస్తామని, అప్పటిదాకా రాష్ట్రాలు వేచి చూడాలని కేంద్ర అధికారి సూచించారు. దీంతో తెలంగాణ అప్పులకు ఇంకా గ్యారంటీ లభించనట్లే అయింది. ఈ విషయాలను తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Centre government, CM KCR, Financial problem, Telangana