తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకోసం ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పక్క పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై సీరియస్‌గా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లను (BJP Assembly Incharges) నియమించింది. అక్టోబరు 7న మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ప్రభారీలను ప్రకటించింది. ఆ మరుసటి రోజే వారితో బీజేపీ పెద్దలు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం కోసం ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశారు. ఐతే తమకు పెద్ద బాధ్యతను అప్పచెప్పారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే వస్తుందనుకున్న ఇన్‌చార్జ్‌లకు.. అంతలోనే బిగ్ షాక్ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు పోటీ చేయకూడదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ స్పష్టంచేశారు. ఎన్నికలకు దూరంగా ఉంటూ.. పార్టీని గెలిపించాలని సూచించారు. దాంతో అక్కడున్న ఇన్‌చార్జ్‌లంతా అవాక్కయ్యారు.
బీజేపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జులుగా నియమితులైన నేతలతో శనివారం బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్భుగ్, సహ ఇన్‌ఛార్జి అరవింద్ మేనన్ పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అధ్యక్షతన దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశాలు విడివిడిగా జరిగాయి. మొదట జిల్లాల్లో పార్టీ పరిస్టితి, బూత్ కమిటీలు, శక్తికేంద్రాలు,మండల కమిటీల గురించి జిల్లా అధ్యక్షులతో తరుణ్ చుగ్ మాట్లాడి.. నివేదికలు తీసుకున్నారు. ఆ తర్వాత కొత్తగా నియమితులైన అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా ఏరికోరి మిమ్మల్ని నియమించామని.. ఆషామాషీగా తీసుకోవద్దని.. కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. మీరు ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మీరంతా దూరంగా ఉండాలని సూచించారు.
అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన వారిలో మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస రెడ్డి, యెండల లక్ష్మీనారాయణతో పాటు ధర్మారావు, విఠల్, స్వామిగౌడ్, బండ కార్తీక వంటి నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయకూడదని సునీల్ బన్సల్ చెప్పడంతో.. వీరంతా షాక్ అయ్యారు. ఇదేంటని కొందరు ఆశావహలు స్పందించడంతో.. అక్కడో కాలు.. ఇక్కడో కాలు వేస్తే.. ఎలా కుదురుతుందని సునీల్ బన్సల్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంత మందికి ఆసక్తి ఉందని అడగడంతో.. మూడొంతులకు పైగా ఇన్‌చార్జ్‌లు చేతులెత్తారు. ఐతే మీ సొంత నియోజకవర్గంలో వేరొక ఇన్చార్జి పార్టీ కోసం పనిచేస్తారని.. మీరు మాత్రం మీకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. Te ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Hyderabad, Telangana