ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో వివిధ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఇప్పటికే అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ స్పందించగా తాజాగా కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. దీనిపై గతంలో మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల లావాదేవీలపై సీబీఐ విచారణ జరపాలని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కూడా దర్యాప్తు చేయాలన్నారు.
అసలు కేసు ఏంటి?
గతేడాది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డితో నందకుమార్, సింహయాజి, రాంచంద్రభారతి బేరసారాలు చేశారు. పార్టీని వదిలి వస్తే రూ.50 కోట్ల డీల్ ను ముందు ఉంచారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు ఈ డీల్ ను భగ్నం చేశారు. ఆ తరువాత నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత సిట్ దర్యాప్తు చేయగా అనూహ్య పరిణామాలతో కేసు హైకోర్టుకు చేరింది. దీనితో విచారణ జరిపిన కోర్టు గతంలోనే సీబీఐకి అప్పగించింది. కానీ సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి కొన్నిరోజులు ఆగాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ తోనే విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధిస్తూ సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం..
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగలడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి కొంత సమయం పట్టె అవకాశం ఉంది. దీనితో ఆర్డర్ సస్పెన్షన్ ను మరింత సమయం పొడిగించాలని AG కోరగా డివిజన్ బెంచ్ అందుకు నిరాకరించింది. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.