• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • BHAINSA VIOLENCE INTERNET SERVICES SUSPENDED ACROSS NIRMAL DISTRICT SU

Bhainsa: భైంసాను వీడని భయం.. మహాంగాలో హోటల్‌, రెండు ఆటోలకు నిప్పు.. జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్..

భైంసా అల్లర్లు(ఫైల్ ఫొటో)

భైంసాలో మరోసారి కొద్దిపాటి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Share this:
    భైంసాలో మరోసారి కొద్దిపాటి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. భైంసా మండలంలోని మహాంగాలో గురువారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఓ హోటల్, రెండు ఆటోలకు కొందరు వ్యక్తులు నిప్పంటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించినట్టు ఎస్పీ విష్ణువారియర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం ఐదుగురిని గుర్తించామని, అందులో ఒకరిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మరోచోట ఇదే తరహా ఘటనను ముందుగానే పసిగట్టిన పోలీసులు ఆ చర్యను అడ్డుకున్నారని తెలిపారు. ఆ ఘటనకు కారకుడైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనలతో భైంసా ప్రాంతంలోని ప్రజలను భయం వీడటం లేదు.

    ఇక, భైంసాలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని ఎస్పీ తెలిపారు. గురువారం వరకు 21 కేసులు నమోదు చేశామని.. శుక్రవారం మరో మూడు కేసులు నమోదు చేశామని చెప్పారు. తాజా పరిణామాలతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. భైంసా అల్లర్ల నేపథ్యంలో శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసుల సూచనల మేరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్టు.. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటింగ్ సంస్థలు వినియోగదారులకు సమాచారం అందించాయి.

    ఇక, ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ.. అల్లర్లకు దారితీసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో పోలీసులు బైంసా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. దీంతో రోడ్లపై జనాలు కనిపించడం లేదు. ఐదు రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలో పోలీసులు భారీగా బందోబస్తు కొనసాగిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: