Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో నేటి తరానికి శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ శ్రీరామావతారం గురించి తెలియని వారు మాత్రం ఉండరు. అంతగా శ్రీరాముడు అందరికీ దగ్గరయ్యాడు. మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి శ్రారాముని అనుగ్రహం కోసం పూర్వం నుంచి రామకోటి రాయడం అనాదిగా వస్తున్న అంశం. సమస్త పాపాలను హరింపచేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక రామనామానికి మాత్రమే ఉందని, రామ అనే రెండు అక్షరాలు ధర్మమార్గాన్ని సూచిస్తూ మోక్షమార్గంలో పయనించేలా చేస్తుందని పూర్వీకుల నమ్మకం. ఇందుకోసమే రామకోటి రాయడం అనేది మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది ఇలా రాసిన రామకోటిని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) తీసుకువచ్చి స్వామివారి సన్నిధిలో సమర్పిస్తుంటారు.
ఈ క్రమంలోనే నేటి యువతలో భక్తి భావాన్ని పెంపొందించి వారిలో ఆధ్యాత్మిక చింతనను మెరుగుపరచాలనే సదుద్దేశంతో హైదరాబాద్ (Hyderabad) కు చెందిన మహిళా భక్తురాలు మల్లి విష్ణు వందన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు లక్షలకు పైగా బియ్యపు గింజలపై రామనామాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో లిఖించారు. అంతేకాకుండా మార్చి 30వ తేదీన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారికి కళ్యాణ తలంబ్రాల నిమిత్తం వినియోగించుటకు 1,01,116 రామ నామాన్ని లిఖించిన బియ్యపుగింజలను భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దేవస్థాన ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా న్యూస్ 18 తో రామ భక్తురాలు మల్లి విష్ణు వందన మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో యువతరంలో భక్తి భావాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ఇప్పటివరకు 7 లక్షల 52,864 బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని కల్పించడం జరిగిందని ఇందులో భాగంగా 1, 01,116 రామ నామాన్ని లిఖించిన బియ్యపు గింజలను భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అందజేయడం జరిగిందని తెలిపారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఆళ్లగడ్డ, విజయనగరం , తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నేరేడుచర్ల హైదరాబాద్, కరీంనగర్ జిల్లా (Karimnagar) ఇల్లందుకుంట ప్రాంతాల్లోని మరి కొద్ది రోజుల్లో జరగబోయే సీతారాముల కళ్యాణం నిమిత్తం మిగిలిన బియ్యపు గింజలను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. స్వతహాగా చిన్ననాటి నుంచే దైవభక్తి పై ఆసక్తి ఎక్కువగా ఉండేదని ఈ కారణం చేత స్వామి వారిని నామాన్ని ఇలా బియ్యం గింజలపై రాయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana