హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: రేషన్ దుకాణం ఏర్పాటుపై అధికారుల నిర్లక్ష్యం.., పేదల నోటికి అందని అన్నం

Bhadradri: రేషన్ దుకాణం ఏర్పాటుపై అధికారుల నిర్లక్ష్యం.., పేదల నోటికి అందని అన్నం

భద్రాద్రి జిల్లాలో రేషన్ కోసం పేదల ఇక్కట్లు

భద్రాద్రి జిల్లాలో రేషన్ కోసం పేదల ఇక్కట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం (Ration Rice) కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇప్పటికీ రేషన్ దుకాణాలు లేక సరుకుల కోసం పక్కనున్న గ్రామాల్లోని షాపులకు వెళ్లి ప్రజలు రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో నూతన రేషన్ కార్డులు సైతం అధికారులు జారీ చేసిన క్రమంలో, వీరి అవసరాల దృష్ట్యా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 442 చౌకధరల దుకాణాలకు తోడు మరో 109 షాపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ నాలుగు నెలల క్రితమే పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా జిల్లాలో నూతనంగా ఒక్క రేషన్ షాప్ కూడా ప్రారంభించలేదు. అసలు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఆచరణలోకి రాలేదు.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలోనే జిల్లా పౌరసరఫరాల అధికారి ( డీఎస్ఓ ) గత జూలై 6న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ డీఎస్ఓఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. సదరు నూతన అధికారి జులై 11నే బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన కామారెడ్డి డీఎసీగా ఆ జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జిల్లాలో పౌరసరఫరాల అధికారి పోస్టు భర్తీ కాక డీఎం (సివిల్) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  ఇది చదవండి: ఇకపై ఆర్టీసీ బస్సులో కండక్టర్ కనిపించడేమో.., కారణం ఇదే..!

  అప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన అధికారి బదిలీ అయిన కొద్ది రోజులకే గోదావరికి వరదలు రావడంతో జిల్లా యంత్రాంగమంతా భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఉండి సహాయక చర్యల్లో తలమునకలైంది. ఆ తర్వాత స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు, తాజాగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు వంటి పనులతో అధికారులు బిజీగా ఉండడంతో కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.

  ఇది చదవండి: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం డివిజన్లో 21 షాపులు, భద్రాచలం డివిజన్లో 13 షాపులు ఇప్పటికీ ఇన్చార్జితోనే నడుస్తున్నాయి. డీలర్లు తమ సొంత దుకాణాల్లో బియ్యం పంపిణీ పూర్తయ్యాక, ఇన్చార్జిగా ఉన్న షాపులపై దృష్టి పెడుతున్నారు. దీంతో ఆయా దుకాణాల పరిధిలోని లబ్దిదారులు బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియక స్థానికులు కూలీ పనులు మానుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే అన్ని గ్రామాల్లో రేషన్ దుకాణాలు, డీలర్లు ఉంటే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండదని తాము పనులు మానుకుని వేచి ఉండాల్సిన అవసరం ఉండదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,94,817 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు పాతవి 2,63,492 ఉండగా, కొత్తగా 12,500 మంజూరయ్యాయి. అంత్యోదయ కార్డులు 18,821, అన్నపూర్ణ కార్డులు 4 ఉన్నాయి. వీటి పరిధిలో 8,48,441 మంది లబ్ధిదారులు ఉన్నారు.

  కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లో రేషన్ షాపుల ఏర్పాటు, ఖాళీల భర్తీకి స్థానిక ఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా, భద్రాచలం డివిజన్లో అక్కడి సబ్ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జిల్లాలోని రెండు డివిజన్ల పరిధిలో ఖాళీల భర్తీకి , నూతన దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. నూతన షాపుల ఏర్పాటుతోనైనా నిరుద్యోగులుగా ఉన్న తమకు ఉపాధి దొరుకుతుందని భావిస్తే ఆ ఆశలు కూడా నెరవేరే పరిస్థితి లేదని జిల్లాలోని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డీఎస్ పోస్టు భర్తీతో పాటు నూతన రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చదువుకొని ఏ ఉపాధి లేకుండా ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని జిల్లాలోని ప్రజలు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Ration Shop, Telangana

  ఉత్తమ కథలు