Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీ ప్రాంతమైన దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా గోదావరి, వాగుల వెంబడి కరకట్ట నిర్మాణ కొనసాగుతున్నాయి. పనులు శరవేగంగా అందులో భాగంగా సున్నం బట్టి నుండి పర్ణశాల వరకు గోదావరి వెంబడి కరకట్ట నిర్మాణ పనులతో పాటు చిన్నగుబ్బలమంగి వాగుకు రెండు వైపులా కరకట్ట పనులు చేపడుతున్నారు. కరకట్టల నిర్మాణం కోసం జిన్నెగూడెం, గౌరవరంతో పాటు పలు చోట్ల నుండి భారీ టిప్పర్లతో రాత్రి, పగలు మట్టి తోలకాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోకరకట్టలకు మట్టి తోలకాలు సాగిస్తున్న టిప్పర్లు ప్రమాదపు వేగంతో రుయ్..రుయ్ మంటూ దూసుకుపోతున్నాయి. దీంతో టిప్పర్ల అతి వేగానికి పల్లె ప్రజానీకం భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
రహదారులు దాటే సమయంలో కనీస నిబందనలు కూడా తెలియని గిరిజన గ్రామాల ప్రజలు వాహనాల అతి వేగానికి ప్రమాదాలు చోటు చేసుకుంటాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రహదారుల నుండి ప్రదాన రహదారికి వచ్చే సమయంలో కూడా టిప్పర్ డ్రైవర్లు అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారు. మట్టి తోలకాలు సాగించే టిప్పర్లు వాహన స్పీడు తగ్గించకుంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అధిక లోడుతో టిప్పర్ల రహదారులపై నిత్యం మట్టి తోలకాలు కొనసాగించడం వలన కోట్ల రూపాయలతో నిర్మించిన భద్రాచలం, చర్ల ప్రదాన రహదారితో పాటు చిన్న నల్లబల్లి-జిన్నెలగూడెం, గౌరవరం నుండి పెద్దనలబల్లి, తాటివారిగూడెం నుండి కె. లక్ష్మీపురం వరకు ఇటీవల నిర్మించిన బిటి రహదారులు పలు చోట్ల దెబ్బ తింటున్నాయనే చెప్పవచ్చు.
ఒక్కో టిప్పరు సుమారు 30 టన్నులు మాత్రమే కెపాసిటీ కలిగి ఉండగా దానికి విరుద్ధంగా అధికలోడుతో మట్టి తోలకాలు కొనసాగించడం వలన రహదారులు శిధిలం అవుతున్నాయి. అంతేకాకుండామట్టి తోలకాల పేరుతో గ్రామాలలో రాత్రి, పగలు టిప్పర్లు తిరగడం వలన రహదారి వెంబడి ఉన్న ఇళ్లలోకి దుమ్ముదూళి చేరుతోంది. దీని వలన ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దుమ్ము దూళి చేరకుండా రహదారుల వెంబడి వాటరింగ్ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నామమాత్రంగా వాటరింగ్ పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు రాత్రి పూట వాహనాల శబ్దంతో నిద్ర ఉండడం లేదని కరకట్ట నిర్మాణ పనుల ప్రదేశంలో ఉన్న ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. టిప్పర్లు ప్రమాదపు వేగంతో దూసుకు పోతున్నా పట్టించుకునే వారే లేరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి తోలకాలు కొనసాగిస్తున్న సమయంలో ఒకటి రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ వారికి కొంత డబ్బులు ముట్ట చెప్పి కేసులు కాకుండా జాగ్రత్తపడ్డట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రమాదాల నివారణ కోసం టిప్పర్ల అతి వేగానికి బ్రేకులు పడే విదంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana