Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే సాక్షాత శ్రీమన్నారాయణడే రామునిగా భూమిపై అవతరించిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadrachalam Temple) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష పుష్కరోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు దేవస్థానం ఆవరణలో ఏర్పాటుచేసిన తాత్కాలిక యాగశాల వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా పట్టాభిషేక యాగశాల వద్ద అగ్నిమథనం చేసి అగ్నిని పుట్టించిన అనంతరం మహాక్రతువును రుత్వికులు సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం 12 కుండాలతో శ్రీరామాయణ మహాక్రతువును రుత్వికులు నిర్వహిస్తున్నారు. పుష్కర యాగశాల వద్ద తిరువారాధన సేవాకాలం, తీర్థగోష్టి నిర్వహించారు. అలాగే చతుర్వేద హవనాలు, శ్రీరామాయణ హవనం, శ్రీరామ షడక్షరి, నారాయణ అష్టాక్షరి మంత్ర హోమాలు నిర్వహించారు.
అదేవిధంగా సంక్షేప్త రామాయణ సామూహిక పారాయణం నిర్వహించారు. ఇదే క్రమంలో నిత్య పూర్ణాహుతి, పురోడాశ, ప్రసాద వినియోగం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, సాయంత్రం సైతం శ్రీరామాయణ మహాక్రతువు హోమాలు నిర్వహించి నిత్య పూర్ణాహుతి ప్రసాద వినియోగం చేశారు. ఇదిలా ఉండగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మో త్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రధాన ఆలయం పక్కన గల యాగశాలలో అర్చకులు సంప్రదాయబద్ధంగా హోమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విధి విధానాల గురించి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన స్థానాచార్యులు కేయి స్థల సాయి న్యూస్ 18 తో ముచ్చటించారు.
ప్రతి 12 నెలలకు ఒకసారి దేవస్థానంలో నిర్వహించే సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని అత్యంత నియమనిష్ఠలతో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ పుష్కర సామ్రాజ పట్టాభిషేకం పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో రెండు తాత్కాలిక యాగశాలను నిర్మించినట్లు తెలపి ఈ తాత్కాలిక యాగశాల యందు శ్రీరామాయణ మహాక్రతువులో అంతరాగంగా ఇష్టి యాగశాల వద్ద పంచేష్టి క్రతువులు నిర్వహిస్తున్నామని స్థల సాయి వివరించారు. అంతేకాకుండా తొలి రోజున జ్ఞాన సిద్ధి, సకల విద్యా ప్రాప్తికై శ్రీ హయగ్రీవేష్టి హోమాన్ని సంప్రదాయబదంగా భక్తిప్రపత్తులతో పూర్తి చేసినట్లు ఆస్థాన స్థానాచార్యులు వివరించారు.
ఇదిలా ఉండగా నేడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సామ్రాజ పుష్కర పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని సకల శుభప్రాప్తి, మోక్షప్రాప్తి కోసం శ్రీ లక్ష్మీనారాయణేష్టి హోమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆయన భక్తులను సాదరంగా ఆహ్వానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bhadrachalam, Bhadradri kothagudem, Local News