రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయంలో జనవరి 25 నుంచి 29 వరకు వాగ్గేయకారోత్సవాలను నిర్వహించనున్నారు. నేలకొండపల్లిలో జన్మించిన కంచెర్ల గోపన్న హసనాబాద్ (పాల్వంచ పరగణాకు తహసిల్దార్ గా విధులు నిర్వహించే క్రమంలో కుటుంబంతో కలిసి భద్రాచలంలో నివసించారు. ఆ సమయంలో పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ సీతారామ లక్ష్మణుల విగ్రహాల గురించి వివరించడంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఇలా రాముడికి దాసుడిగా భక్త రామదాసుగా కీర్తి గడించారు. ఆ మహనీయుడి 390వ జయంతిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు ఉత్సవాలను కొనసాగించేందుకు భద్రాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి (ఈవో) శివాజీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
ఈ మహా కార్యక్రమానికి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం వేదిక కానుంది. దేవస్థానానికి ప్రఖ్యాత సంస్థలు సహకరించి దేశంలోని ప్రముఖ కళాకారులను రప్పిస్తున్నాయి. ఇక్కడ ఆలపించే నవరత్నకీర్తనల గోష్టికి ప్రత్యేకత ఉంది. వయోలిన్, తబల, మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాయిద్య పరి కరాలతో శాస్త్రీయ సంగీతం అందించనున్నారు. భజనలు కీర్తనలు ఉంటాయి.
ఇదిలా ఉండగా వాగ్గేయకారుల్లో అన్నమయ్యది సుస్థిర స్థానం. ఆయనకు పద కవితా పితామహుడిగా పేరుంది. నాద బ్రహ్మగా కీర్తిగడించిన వాగ్గేయకారుడు త్యాగయ్య, త్యాగయ్య మాతృమూర్తి.. రామదాసు కీర్తనలను విని వీటిని త్యాగయ్యకు నేర్పించినట్లు చెబుతుంటారు. సంగీతానికి త్యాగయ్య, సాహిత్యానికి అన్నమయ్య, భక్తికి రామదాసు నిలువెత్తు నిదర్శనాలు.
ఇలాంటి మహనీయుల జయంతి ఉత్సవా లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భద్రాచలం రామాలయంలో భక్త రామదాసు జయంతి ప్రయుక్తంగా (పురస్కరించుకుని) వాగ్గేయకారోత్సవాలను చేస్తారు. భారతీయ కళల్లో సంగీతానిది గొప్ప స్థానం ఉంది. సంగీతానికి వైదిక పరమైన సాహిత్యంతో కూడిన స్వరం తోడైతే అది వాగ్గేయకారోత్సవం అనిపండితులు అంటున్నారు. ఈ కోవకు చెందిన మహనీయును వాగ్గేయకారులుగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా1973 నుంచి వాగ్గేయకారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో ఘంటసాల, వాణీజయరాం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖులు గతంలో కచేరీలు చేశారు. ఇవి మొదలై యాభై ఏళ్లు పూర్తవుతుండడంతో ఈ సారి ఘనంగా సంగీతార్చన చేయాలని భావిస్తున్నారు. గడిచిన రెండేళ్లు కొవిడ్ ఆంక్షలతో అంతంత మాత్రంగా చేశారు. ఈసారి అర్ధశతాబ్ది ఉత్సవాలను వైభవంగా చేస్తారని భక్తులు ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana