Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచే దేవుడు సీతారామచంద్రస్వామి. ఆయన కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం (Bhadrachalam Temple). ఈ పుణ్యక్షేత్రంలో మరి కొద్ది రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో మార్చి 30వ తేదీన సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి వేడుకను మరుసటి రోజు అనగా మార్చి 31వ తేదీ సీతారాముల సామ్రాజ పుష్కర పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించేందుకు భద్రాచల దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు వివిధరకాలుగా భక్తులకు సేవలు అందిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖ మొదలు మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖ వరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ విధులను నిబద్దతతో నిర్వహిస్తూ స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం భద్రాచల రాములవారికి సేవలందిస్తూ ముందుకు సాగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాచలానికి బస్ సర్వీసులు పెంచడమే కాకుండా గత సంవత్సరం నుంచి సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాద్రిలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలను సైతం ఆర్టీసీ పార్సెల్ కార్గో సర్వీస్ ద్వారా భక్తులకు చేరవేస్తుంది.
నిజానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే నవమి వేడుకల్లో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉన్నది. ఈ తలంబ్రాలను శుభకార్యాలలో అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ తలంబ్రాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలను అందించేది. లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టిసి పార్సిల్ కార్గో సేవల ద్వారా ఈ తలంబ్రాలను భక్తులకు చేరవేసే నిర్ణయం తీసుకుంది. స్వామివారి తలంబ్రాలు కావలసిన భక్తులు రూ.116 రూపాయలు చెల్లించి దగ్గర్లోని టీఎస్ ఆర్టీసీ పార్సెల్ కార్గో సర్వీస్ సెంటర్ లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకున్న తర్వాత భద్రాద్రి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం అనంతరం ఆర్టీసీ సిబ్బంది స్వయంగా ఇంటి వద్దకు ముత్యాల తలంబ్రాలను చేర్చనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలియజేశారు.
ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆర్టీసీ ఎండి సజ్జనార్ బస్ భవన్ లో కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్టీసీ బిజినెస్ హెడ్ (కార్డ్) సంతోష్ కుమార్ రూ.116 చెల్లించి తలంబ్రాలను బక్ చేసుకొని, రసీదును ఎండీ నుంచి తీసుకున్నారు. ఎండీ మాట్లాడుతూ.. ఈసారి రాములోరి కల్యాణంతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుందన్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు ఆర్టీసీ కార్గో ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 నంబర్లను సంప్రదించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana, Tsrtc