Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అనుయాయులుగా కొనసాగుతున్న అధికార పార్టీ అసంతృప్తివాదులకు అధికారపక్షం షాకిచ్చింది. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికార పార్టీ తరపున ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా కొనసాగుతున్న వారికి రక్షణ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్లను కేటాయించింది. అయితే ఈ ఏడాది జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మాజీ ఎంపీ పొంగులేటి తొలిసారిగా ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో అనంతరం ఆయన గన్ మెన్లను కుదించగా ఆయన అసలు సెక్యూరటినే వద్దంటూ వారిని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District) లో వివిధ నియోజకవరాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రభుత్వ పాలన తీరును ఎండగడుతున్నారు.
ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి నుంచి మాజీ ఎంపీ పొంగులేటి ప్రధాన అనుచరులుగా కొనసాగుతున్న జిల్లా జడ్నీ చైర్మన్ కోరం కనకయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ పరంగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్న 2-2 గన్ మెన్లను కుదించి 1+1గా కొనసాగించాలని నిర్ణయించింది. దాంతో ఉన్న ఆ గన్ మెన్లు సైతం తనకు వద్దంటూ కోరం వారిని వెనక్కిపంపారు. ఈ పరిణామాలపై జడ్పీచైర్మన్ కోరం కనకయ్య న్యూస్ 18 ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాలతో సమస్మాత్మక ప్రాంతంగా ఉన్నప్పటికీ గన్ మెన్లను కుదించడం సమంజసం కాదన్నారు. తనకు కేటాయించిన గన్ మెన్ల సంఖ్యను కుదించడం గిరిజన ప్రజా ప్రతినిధుల పట్ల అనుచరిస్తున్న వివక్షతకు నిదర్శమని కోరం పేర్కొన్నారు.
అలాగే గతంలో పినపాక నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పాయం వెంకటేశ్వర్లుకు, భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ బాధ్యుడు డా.తెల్లం వెంకట్రావుకు కూడా గన్ మెన్ లను అధికారికంగా ఉపసంహరించారు. ముగ్గురు నాయకుల గన్ మెన్ లువెంటనే జిల్లా పోలీసు అధికారులకు రిపోర్డు చేయాలని ఆదేశాలు అందాయని పొంగులేటి వర్గీయుల్లో
జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా మార్చి 25న భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మాజీ ఎంపీ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గ బాధ్యుడు డా.తెల్లం వెంకట్రావు, ఇతర నాయకులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పొంగులేటి వర్గీయులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో అధికారంలో కొనసాగుతున్న పార్టీ భద్రాచలం నియోజకవర్గాన్ని విస్మరించిన తీరు, నిర్లక్ష్యం, అటకెక్కిన హామీలు, పోడు భూముల సమస్య, భద్రాద్రికి జరుగుతున్న ఆన్యాయం, సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో స్థానిక దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చుక్క సాగునీరు కూడా అందే పరిస్థితి కూడా లేని వైనం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను, ఇతర పార్టీల నాయకులను మాజీ ఎంపీ పొంగులేటి బాటన నడిచేందుకు ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Ponguleti srinivas reddy, Telangana