హోమ్ /వార్తలు /తెలంగాణ /

అన్నంపెట్టే ఆకు.. ఈసారి ఆదుకుంటుందా..? గిరిజనుల కడుపు నింపుతుందా..?

అన్నంపెట్టే ఆకు.. ఈసారి ఆదుకుంటుందా..? గిరిజనుల కడుపు నింపుతుందా..?

భద్రాద్రి ఏజెన్సీలో తూనికాకు సేకరణకు ఇబ్బందులు

భద్రాద్రి ఏజెన్సీలో తూనికాకు సేకరణకు ఇబ్బందులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీలో నివసించే గిరిజనులకు ఎండాకాలం అడవులలో సహజ సిద్ధంగా లభించే తునికాకును సేకరించి ఉపాధి పొందుతుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీలో నివసించే గిరిజనులకు ఎండాకాలం అడవులలో సహజ సిద్ధంగా లభించే తునికాకును సేకరించి ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో గత ప్రభుత్వాలు తునికాకు సేకరణకు పూనుకున్నాయి. అయితే ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది మాత్రం గిరిజనులకు మొండిచేయి మిగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ఏడాది జనవరి నాటికే టెండర్లను పిలిచి తునికాకు సేకరణకు కాంట్రాక్టర్లను కేటాయించే ప్రభుత్వం ప్రతి ఏడాదితునికాకు సేకరణకు నిర్వహించే టెండర్లు ఈ ఏడాది ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తయినా అగ్రిమెంట్ చేసుకోవడంలో కాంట్రాక్టర్లు మరింత జాప్యం చేస్తుంటారు. దీంతో సేకరణ సమయం పూర్తయి, అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా ఆకు పాడైపోతుంది. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గతంలో తునికాకు సేకరణ ప్రక్రియను డిసెంబరులోనే ప్రారంభించేవారు. అటవీశాఖ ద్వారా జరిగే ఈ టెండర్లు పూర్తి కాగానే కూలీల సంఖ్య, కల్లాల ఏర్పాటు, రవాణాకు వినియోగించే వాహనాలు తదితర వివరాలతో కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకునేవారు. కొన్నేళ్లుగా ఫిబ్రవరిలోనే టెండర్లు పిలుస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే మార్చి వరకు కొనసాగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 6,14 తేదీల్లో ఈ-టెండర్ల స్వీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికీ కాంట్రాక్టర్లు రాకపోతే మార్చిలో కూడా స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. గతేడాది మాదిరగానే అగ్రిమెంట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది.

ఇది చదవండి: ఈ డ్రాయింగ్ టీచర్ స్టైలే సపరేటు.. ఆకులతోనే అద్భుతాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30 యూనిట్ల ద్వారా ప్రతి ఏడాది 38,800 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించనున్నారు. ఇదిలా ఉండగారాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 ఇస్తామని ఇటీవలే ప్రకటించారు. గతంలో రూ.2.01 మాత్రమే ఇచ్చే వారు. ఏకంగా రూపాయి వరకు పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే కార్మికులు మాత్రం రూ. 5లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రేట్ పెంచడానికి జీవో రాలేదు. ఇప్పటికే కార్మికులతో పాటు కార్మిక సంఘాలు కూడా జీవో విషయంలో ఆందోళనలు చేపడుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర సర్కారు తునికాకు కార్మికులకు బోనస్ ఇవ్వకుండా దగా చేస్తోంది. 2012-14 మధ్యకాలంలో బోనస్ ఇచ్చి ఆ తర్వాత 8 ఏళ్లుగా పైసా విధించడం లేదు.

ఏటా గిరిజనులు సేకరించిన తునికాకును అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో కొంత బోనస్ రూపంలో ప్రభుత్వం కార్మికులకే ఇస్తుంటుంది. ఈ విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.16కోట్ల బోనస్ ప్రభుత్వం వద్దే ఉంది. వేసవిలో పంటగా భావించే తునికాకు సేకరించి గిరిజన కార్మికులు ఉపాధి పొందుతుంటారు. బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రకరకాల కారణాలు చెప్పి తాత్సారం చేస్తోంది. ఒకసారి బ్యాంకు అకౌంట్లు సరిగ్గా లేవని, మరోసారి పేర్లు తప్పుగా ఉన్నాయని కొర్రీలు పెడుతూ వస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా తునికాకు సేకరణే జరగలేదు. తర్వాత సేకరణ ఆలస్యం కావడంతో వర్షాలు ఇతరత్రా కారణాలతో ఆకు తక్కువగా వస్తోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన తమకు బోనస్ ఇంటి అవసరాలు తీరుతాయని కార్మికులు వేడుకుంటున్నారు.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు