హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: పల్లిపట్టీల వ్యాపారం.. బిజినెస్​లో రాణిస్తూ శభాష్​ అనిపించుకుంటున్న ఆదివాసీ మహిళలు.. 

Bhadradri: పల్లిపట్టీల వ్యాపారం.. బిజినెస్​లో రాణిస్తూ శభాష్​ అనిపించుకుంటున్న ఆదివాసీ మహిళలు.. 

బిజినెస్​

బిజినెస్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది గిరిజన మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  ఆదివాసీలు..! (Adivasis) వారికి అడవితోనే అనుబంధం. అడవే వారికి ఆధారం. విప్పపువ్వు, బీడీ ఆకులు సేకరిస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం కాలం మారింది. మహిళలంటే వంటింటికే పరిమితంకాదని నిరూపిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించి సొంతకాళ్లపై నిలబడుతున్నారు. తాము తలుచుకుంటే ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఈ గిరిజన మహిళలు (Tribes woman) ఆదర్శంగా నిలుస్తున్నారు.

  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండలం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది గిరిజన మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. బండిరేవు గ్రామానికి చెందిన శ్యామల, అర్చన సొంతంగా ఏదైనా చిరు వ్యాపారం ప్రారంభించాలని భావించారు. తమ ఆలోచనను మరికొందరు స్థానిక మహిళలతో పంచుకోగా అందరూ కలిసి ఏదైనా చిన్నతరహా పరిశ్రమ పెట్టాలని భావించారు. చిక్కీ (పల్లిపట్టీ)లకు డిమాండ్ ఉందని గ్రహించి ఆదిశగా అడుగులు వేశారు. శ్యామల అర్చన , పూనెం గంగ , పాయం నర్సీరత్నం , తెల్లం నాగమ్మ , కుంజా లక్ష్మి , మర్మం సుజాత , నూప సోమమ్మ , కణితి రాజమ్మ , తెల్లం సీతమ్మ , పూనెం దుర్గ , కుంజా అరుణతో పాటు జగిడి అర్జున్ , కుర్సం మోహనరావు , కార్తీక్ , పూనెం ఏడుకొండలు కలిసి పల్లీపట్టీ యూనిట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే నాణ్యమైన చిక్కీ తయారు చేయాలంటే అందుకు మంచి యంత్రాలతో పాటు ముడిసరుకు కావాలని గ్రహించి ప్రభుత్వ సాయాన్ని కోరారు.

  రూ. 24 లక్షలు సబ్సిడీ: పల్లి చిక్కీ తయారీ యూనిట్ కోసం పెట్టుబడి ఖర్చు రూ. 40 లక్షలు అవుతుందని తెలుసుకుని, స్థానిక అధికారుల సహాయంతో ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రును సంప్రదించారు. ఐటీడీఏ అధికారులు సానుకూలంగా స్పందించారు. రూ. 24 లక్షలు సబ్సిడీ ఇస్తామని, రూ. 12 లక్షలు బ్యాంకు రుణం ఇప్పిస్తామని, మరో రూ. 4 లక్షలు మహిళలు పెట్టుకోవాలని సూచించారు. ఐటీడీఏ సబ్సిడీ, బ్యాంకు రుణం మంజూరు కావడంతో లక్ష్మీనగరంలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్‌లో యూనిట్ ప్రారంభించారు. మిషనరీ లో సహాయం చేసేందుకు (ఎలక్ట్రిషియన్ , ఇతర కష్టతరమైన పనుల కోసం) నలుగురు పురుషులను సైతం గ్రూపులో చేర్చుకున్నారు. 2022 జనవరి 26న యూనిట్ ప్రారంభించి చుట్టుపక్క మండలాలైన భద్రాచలం, మణుగురు అంగన్వాడీ కేంద్రాలకు పల్లిపట్టీలను సరఫరా చేస్తున్నారు.

  తయారైన పల్లీ పట్టీలను ఐటీడీఏ (ITDA) సహకారంతో గిరిపోషణ పథకం కింద భద్రాచలం, మణుగూరు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ యూనిట్ నుంచి నెలకు 10 వేల కేజీల పల్లీపట్టీలను తయారు చేసే అవకాశం ఉంది. 2022-23 విద్యా సంవత్సరానికి ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలలకు కూడా ఇక్కడ తయారు చేసే పల్లీపట్టీలనే సరఫరా చేస్తామని ఐటీడీఏ అధికారులు హామీ ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా ఈ మహిళలు ముందుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఐటీడీఏ ద్వారానే మార్కెటింగ్ జరుగుతోందని, ప్రైవేట్ వ్యాపారుల నుంచి అర్డర్లు వస్తే తయారీని మరింత పెంచుతామని గ్రూప్ సభ్యులు చెబుతున్నారు.

  Ganesh Chaturthi: ఈ వినాయ‌క మండపంలో గ‌ణేశుడి బ్యాటింగ్.. ఎలుక బౌలింగ్.. ఎక్క‌డో తెలుసా?  

  ఇలా ఉండగా పల్లీపట్టీ తయారీకి కావాల్సిన మిషనరీని ఇక్రిశాట్ ద్వారా సమకూర్చారు. పల్లీపట్టీల తయారీలో మహిళలకు అనుభవం వచ్చేంతవరకు ఒక సంవత్సరం పాటు యంత్రంలో ఏమైనా లోటుపాట్లు వస్తే ఇక్రిశాట్ టెక్నీకల్ అధికారి ఆధ్వర్యంలో సంవత్సరం పాటు పర్యవేక్షణ చేస్తున్నారు. మహిళలకు యంత్రాలలో పనులు, బుక్ కీపింగ్, యూనిట్ మెయింటెనెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.

  భారతదేశ ఆహార ఉత్పత్తుల స్టాండర్డ్స్ (BSI) ప్రామాణాలతో తయారుచేస్తున్న ఈ పల్లీపట్టీలకు నాణ్యతగల పల్లీలను, ముడిసరుకును వినియోగిస్తున్నారు. మొదటగా పల్లీలను గ్రేడింగ్ చేసి వాటిని వేయించి పొట్టుతీసి ఒక్కో గింజను రెండు భాగాలుగా విడగొడుతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి తెప్పించిన నాణ్యమైన బెల్లం, పంచదారతో కలిపి ఉడికిస్తారు. ఉడికిన పల్లీలను ప్రాసెస్ చేసిన అనంతరం 35 గ్రాముల పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అన్నీ నాణ్యమైన పదార్ధాలే వాడుతుండటంతో ఈ పల్లీపట్టీలు ఎంతో రుచిగా ఉంటున్నాయి. ఇక్కడ రెండు రకాల చిక్కీ తయారు చేస్తున్నారు. పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార, లాక్సిడ్ గ్లూకోజ్ కలిపి ఒక రకం. పల్లీలు, నువ్వులు, బెల్లం పంచదార, లాక్సిడ్ గ్లూకోజ్ తో మరో వెరైటీ కూడా చేస్తున్నారు.

  ప్రైవేట్ ఆర్డర్లు కోసం పల్లిపట్టీ యూనిట్ సభ్యులను సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 6304110634.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Business Ideas, Local News

  ఉత్తమ కథలు