Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నట్లుగా పలువురు ప్రవాస భారతీయులు సొంతూరితోపాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. పాఠశాలలను బాగు చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైద్యం, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు పాటుపడుతున్నారు. అనాథలు, వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు మన నిత్యం చూస్తూనే ఉంటాం. దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఓ పాఠశాలను నిర్మించారు. చిన్నప్పుడు తాము చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు చేరడానికి గమనించిన ప్రవాస భారతీయులు సూదిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు సూదిరెడ్డి వీరారెడ్డి సుమారు రూ. 1కోటి 30 లక్షలకు పైగా ఖర్చుతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి అందజేశారు.
ప్రస్తుతం ఆ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలం నరసాపురంలోని జిల్లా ఉన్నత పాఠశాల చూసేందుకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, అద్భుతమైన ఆర్కిటెక్ పద్ధతుల్లో నిర్మించబడిన ఈ ప్రభుత్వ పాఠశాల ఏజెన్సీలో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది.
నర్సాపురం గ్రామానికి చెందిన సూది రెడ్డి రామకృష్ణారెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహకుడిగా, ఆయన సోదరుడు సూదిరెడ్డి వీరారెడ్డి కార్డియాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. చిన్నప్పుడు వారి స్వగ్రామంలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడానికి గమనించిన ఈ సోదరులు సదరు పాఠశాలకు మూడెకరాల్లో రూ.1.23 కోట్లతో అన్ని సదుపాయాలతో కూడిన భవనం నిర్మించారు.
విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, కంప్యూటర్ తరగతి గదులు, ల్యాబ్ లు అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాల భవనాన్ని 2004లో నాటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ప్రారంభించడం విశేషం. ఇదిలా ఉండగా సూదినేని బ్రదర్స్ ఏటా పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల బాగోగులు చూసుకుంటూ వాళ్లకు యూనిఫాంలు, షూలు, పుస్తకాలు, ఇతర సామగ్రి అందిస్తూ ఉంటారు. వారి తోడ్పాటుతో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు ఆధునిక విద్య అందుతోంది. కార్పొరేట్ పాఠశాలలో చదువుకోలేని గిరిజనులకు కార్పొరేట్ పాఠశాల ధీటుగా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో సూది రెడ్డి నాగిరెడ్డి, ఆదిలక్ష్మి అమ్మ మెమొరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలుస్తుండడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, NRI, Telangana