Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి (Bhadrachalam Temple) వారి దేవస్థానంలో స్వామి వారికి జరిగే పూజాది కైంకర్యాలలో ప్రతి శుక్రవారం జరిగే సంధ్యా హారతి సేవకు విశేష స్థానం ఉంది. అక్టోబర్ 2017న త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సంధ్య హారతి ఆర్జితసేవ ప్రతి శుక్రవారం దేవస్థానం ఆవరణలోని అద్దాల మండపంలో స్వామి వారికీ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అద్దాల మండపంలోని రాజాధిరాజా సింహాసనంపై స్వామివారిని ఆసీనులు చేసి అర్చకులు అష్టోత్తర శతనామాత్సవాలతో స్వామివారికి పూజలు చేస్తారు. అనంతరం స్వామివారికి గజ, అశ్వ, శేష, గరుడ, అష్టోత్తర అని పిలవబడే పంచహారతులను అర్చకులు సమర్పిస్తారు.
సకల దోష నివారణకు, సకలాబిష్ఠ సాధనకు సంధ్య హారతి సేవ శ్రేయస్కరమని దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామాంజనేయ చార్యులు తెలిపారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ విశేష సేవలు మంగళ వాయిద్యాలు, జేగంటల ధ్వనుల నడుమ ఆద్యంతం కన్నుల పండుగగా ఈ సంధ్య హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానంలోని టికెట్ కౌంటర్లలో 516 రూపాయలతో సంధ్య హారతి టికెట్లను తీసుకొని పూజలో పాల్గొనవచ్చు. ఒక టికెట్ పై ఒకరు లేదా దంపతులను అనుమతిస్తారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు లడ్డుని ఉచితంగా అందజేస్తారు.
శ్రీరామ మూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్తరద్వారంలోని ఊయలలో కూర్చోబెట్టి పూజలు నిర్వహిస్తారు. అర్చకులు దీపారాధన ఇస్తూ, మంగళశాసనాలు పలుకుతుండగా భక్తులు మహాపురుషుడైన శ్రీరామచంద్ర ప్రభువుకూ జై అంటూ భక్తుల జయజయ ధ్వానాల నడుమ సంధ్య హారతి ఇస్తారు. మొత్తం నాలుగుసార్లు శ్రీరామ మూర్తికి సంధ్య హారతి ఇచ్చిన అనంతరం ఐదోసారి భక్తులను భాగస్వాములను చేస్తూ హారతి ముగిస్తారు. శుక్రవారం నాడు జరిగే ఈ హారతి కార్యక్రమంలో పాల్గొంటే దోషాలు తొలగి అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana