Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఏళ్లనాటి వంతెన నిర్వహణ కరవై శిథిలావస్థకు చేరింది. కొత్త వంతెన నిర్మాణం నిర్లక్ష్య నీడలో ఏళ్లుగా కొనసాగుతోంది. ఫలితంగా 30కి పైగా గిరిజన తండాలకు చెందిన ప్రజలు చుట్టూ తిరిగి పలు ఊళ్ల మీదుగా రాకపోకలు సాగించాల్సివస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) సుజాతనగర్ మండలంలోని ఎదుళ్లవాగు వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మండల కేంద్రమైన సుజాతనగర్ నుంచి సీతంపేట గ్రామానికి నిత్యం వందలాది మంది ప్రజలు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎదుళ్లవాగు పైనున్న పాత వంతెన మూణ్నెల్ల క్రితం కుంగిపోయింది. దీంతో ఇటుగా రాకపోకలు నిలిపివేశారు అధికారులు. పక్కన రూ.6.28 కోట్లతో చేపట్టిన మరో వంతెన నిర్మాణం ఏళ్లకేళ్లుగా పునాదుల స్థాయిలోనే ఉంది.
2023, ఏప్రిల్ నాటికి దీన్ని పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పునాదులు, పిల్లర్ల స్థాయిలోనే ఈ నిర్మాణపు ప్రక్రియ కొనసాగుతుండడంతో వంతెన పూర్తయ్యేదెన్నడు అంటూ ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఉన్న పాత లోలెవల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే సాకుతో నిర్మాణపు పనులు అడ్డుగా ఉన్నాయని పాత వంతెన బీములను సదరు కాంట్రాక్టర్ తొలగించడం జరిగింది. దీంతో అంతంతమాత్రంగా ఉన్న పాత వంతెన పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది.
ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడం కొత్త వంతెన పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో సీతంపేటబంజర, సీతంపేట, నిమ్మలగూడెం, కోమటిపల్లి, గరీబ్ పేట గ్రామాలకు చెందిన ప్రజలు అదనంగా 5 కిలో మీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇటీవల వరదలు నేపథ్యంలో కొత్త వంతెన ఇప్పట్లో పూర్తయి అందుబాటులోకి వచ్చేలా లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారిలో ప్రమాదం అని తెలిసిన గ్రామస్తులు ఇదే వంతెనను వాడుతుండడం వక్కింత ఆందోళన కలిగిస్తున్న అంశం.
సదరు గిరిజన తండాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ పనులు నిమిత్తం ఇదే రహదారిని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉండగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు హాస్పిటల్స్‌కి, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతర అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇదే దారిని ఉపయోగిస్తూ కుంగిన పాత వంతెన మీదుగానే ప్రయాణిస్తున్నారు.
ఇది మరింత ప్రమాదం అని భావించిన అధికారులు వంతెనకు ఇరువైపులా గోతులు తీసి రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా ప్రజలు ఇదే దారిని ఉపయోగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ అనేకమంది గాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులు గుర్తించి శరవేగంగా వంతెన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Local News, Telangana